ఇప్ప‌టికే దంచికొడుతున్న వాన‌లు.. మ‌రో నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు: ఐఎండీ హెచ్చ‌రిక‌లు

By Mahesh RajamoniFirst Published Aug 9, 2022, 1:23 PM IST
Highlights

central India: వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొన‌సాగుతున్న‌ద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.
 

Heavy rain: దేశ‌వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వాగులువంక‌లు పొంగిపొర్లుతున్నాయి. న‌దుల్లోకి వ‌ర‌ద నీరు పెద్ద‌మొత్తంలో చేరుతోంది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చాలా చోట్ల పంట‌పొలాల్లో వ‌ర‌ద నీరు చేరింది. ఇలాంటి ప‌రిస్థితులు మ‌ధ్య మ‌రోసారి భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే కురుస్తున్న భారీ వ‌ర్షాలతో ప‌లు చోట్ల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతుండ‌గా.. వచ్చే 3-4 రోజుల్లో మధ్య భారతదేశం, భారతదేశ పశ్చిమ తీరంలో విస్తృతమైన, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయ‌ని IMD మంగళవారం నాడు తెలిపింది.

ఆదివారం ఛత్తీస్‌గఢ్, కొంకణ్, గోవా, విదర్భ, ఒడిశా, ఏపీ, తెలంగాణ‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇప్ప‌టికీ ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. రుతుపవన ద్రోణి చురుకుగా ఉంది. దాని ప్ర‌భావం దక్షిణంగా కొన‌సాగుతోంది. ఇది రాబోయే 4-5 రోజులలో అలాగే కొనసాగుతుంది. బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న‌ తీరప్రాంత ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉంది. ఇది రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మ‌ధ్య‌, ద‌క్షిణ భార‌తంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

ఉత్తర ద్వీపకల్ప భారతదేశం మీదుగా తూర్పు-పశ్చిమ షీర్ జోన్ నడుస్తోంది. ఇది వచ్చే 3-4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ వ్యవస్థల ప్రభావంతో, ఆగష్టు 11 వరకు పశ్చిమ బెంగాల్‌లో గంగా నదిపై భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన విస్తృత వర్షపాతం చాలా ఎక్కువగా న‌మోద‌వుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆగస్టు 10, 11 తేదీల్లో జార్ఖండ్,  ఆగస్టు 12 వరకు ఒడిశాలో, అస్సాం & మేఘాల‌యాల్లో  ఆగస్టు 8,9 వ‌ర‌కు, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం & త్రిపుర మీదుగా ఆగస్టు 12 వరకు అల్ప‌పీడ‌న వ్య‌వ‌స్థ కొన‌సాగుతుంద‌ని తెలిపారు. భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఇంత‌కుముందు ఐఎండీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆగస్టు 9,10న ఒడిశాలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో విస్తారంగా భారీ వర్షాలు, ఉరుములు/మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 12 వరకు మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని ఘాట్ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయి. ఆగస్టు 11 వరకు గుజరాత్ లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. 

ఆగ్నేయ రాజస్థాన్‌లో ఆగష్టు 12 వరకు విస్తారంగా భారీ వర్షాలు, ఉరుములు/మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురుస్తాయ‌ని ఐఎండీ తెలిపింది. ఆగస్టు 11న తూర్పు ఉత్తర ప్రదేశ్ & హిమాచల్ ప్రదేశ్ల‌లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. ఆగస్టు 12న పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో భారీ వ‌ర్షం కురుస్తుంద‌ని తెలిపింది. ఆగస్టు 10న ఉత్తరాఖండ్‌, ఆగస్టు 12న తూర్పు రాజస్థాన్‌లో కూడా చాలా భారీ వర్షాలు కురిసే అవకాశముంది.  “గుర్తించబడిన అల్పపీడనం ఒడిశా తీరంలో ఉంది. ఇప్పటికే మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 2-3 రోజులలో ఈ వ్యవస్థ మధ్య భారతదేశం మీదుగా గుజరాత్ తీరం వరకు భారీ వర్షాలు కురిపిస్తుంది. ఈ వ్యవస్థ మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది’’ అని జాతీయ వాతావరణ సూచన కేంద్రం, IMD సీనియర్ శాస్త్రవేత్త ఆర్‌కే జెనామణి మీడియాతో అన్నారు.

click me!