గుజ‌రాత్ లో భారీ వ‌ర్షాలు.. వ‌ర‌ద‌ల్లో 11 మంది మృతి

Published : Jul 02, 2023, 04:28 PM IST
గుజ‌రాత్ లో భారీ వ‌ర్షాలు.. వ‌ర‌ద‌ల్లో 11 మంది మృతి

సారాంశం

Gujarat Rains: గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 11 మంది మృతి చెందగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితి నెలకొందనీ, ప్రభావిత ప్రాంతాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని అధికారులు ఆదివారం తెలిపారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని వెల్ల‌డించారు.   

Heavy rains cause floods in Gujarat: గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో వల్సాద్, నవ్సారి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ గణాంకాలు వెల్లడించాయి. రహదారులు జలమయం కావడం, రోడ్లు దెబ్బ‌తిన‌డంతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు (ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్) చిక్కుకుపోయిన ప్రజలను రక్షించే చర్యల్లో నిమగ్నమయ్యాయని అధికారులు తెలిపారు.

వరదల్లో చిక్కుకున్న ఇంటి నుంచి నీటిని తోడుతూ మూడేళ్ల చిన్నారి శుక్రవారం బావిలో పడి మృతి చెందగా, భారీ వర్షాలతో గల్లంతైన ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీసింది. సురేంద్రనగర్ జిల్లాలోని లింబ్డి తాలూకాలోని అప్రోచ్ రోడ్లు జలమయం కావడంతో గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయని, ఒక గ్రామానికి చెందిన ఏడుగురిని స్థానికులు రక్షించారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు గుజరాత్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ క్ర‌మంలోనే షా రాష్ట్ర ముఖ్య‌మంత్రితో తాజా ప‌రిస్థితులు అడిగి తెలుసుకున్న‌ట్టు వెల్ల‌డించారు. 

"ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక యంత్రాంగం ఈ ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం చేయడంలో బిజీగా ఉంది. ఈ కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలుస్తాయి" అని అమిత్ షా ట్వీట్ చేశారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 32 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందనీ, వల్సాద్ జిల్లాలోని ధరంపూర్ తాలూకా 234 మిల్లీమీటర్లతో అగ్రస్థానంలో ఉందని ఎస్ఈఓసీ తెలిపింది. రాష్ట్రంలోని 205 తాలూకాలలో గణనీయమైన మొత్తంలో వర్షపాతం నమోదైందనీ, వల్సాద్, నవ్సారి, జునాగఢ్, అమ్రేలి, చోటా ఉదేపూర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 100-234 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది.

దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర జిల్లాల్లో సోమవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తన తాజా అంచనాలో తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !