భారీ వర్షాలతో 43 మంది మృతి, జల దిగ్భంధంలో గ్రామాలు

By narsimha lodeFirst Published Aug 9, 2019, 6:56 AM IST
Highlights

భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో 43 మంది మృతి చెందారు. పలు గ్రామాలు జలమయ్యాయి.


న్యూఢిల్లీ:దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సుమారు 43 మంది మృతి చెందారు. మహారాష్ట్రలోనే అత్యధికంగా 27 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, అసోం తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జన జీవనం స్థంభించింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు ముంబైను ముంచెత్తుతున్నాయి.

మహారాష్ట్రాలోని సాంగ్లీ జిల్లాలోని పలుస్ తాలుకాలో వరద బాధితులతో వెళ్తున్న బోటు మునిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో వర్షాల కారణంగా మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 

కర్ణాటక రాష్ట్రంలో తొమ్మిది మంది,కేరళలో నలుగురు, తమిళనాడు కోయంబత్తూరులో ఇద్దరు. ఒడిశాలో ఒకరు వర్షాల కారణంగా మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరిలో అత్యధికంగా 82 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

పలు రాష్ట్రాల్లో చిక్కుకొన్న వరద బాధితులను ఆదుకొనేందుకు  అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలతో రవాణా వ్యవస్థ దెబ్బతింది. రోడ్డు, రైల్వే రవాణా దెబ్బతింది. 

వర్షాల కారణంగా మహారాష్ట్రలోని సాంగ్లీ పలుస్ తాలుకాలోని కృష్ణా, ఏర్లా నదీ సంగమంలో వరద తీవ్రతకు పలు గ్రామాలు జల దిబ్భంధంలో చిక్కుకొన్నాయి. గురువారం నాడు వరద బాధితులను తరలిస్తున్న బోటు మునిగి 9 మంది మృతి చెందారు. మరో 14 మంది గల్లంతయ్యారు. 

తొమ్మిది మృతదేహాలను వెలికి తీశారు.మహారాష్ట్రలోని పుణే, సతారా, సాంగ్లీ, కొల్హాపూర్, షోలాపూర్ జిల్లాల్లో ఇప్పటివరకు 27 మంది మరణించినట్టుగా పూణే డివిజన్ కమిషన్ దీపక్ మైసేకర్ ప్రకటించారు.

కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే 9 మంది మరణించారు. 43 వేల మంది నిరాశ్రయులయ్యారు. బెళగావి జిల్లాలోనే సీఎం యడియూరప్ప మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాసం కోసం ముందుకు రావాలని ఆయన దాతలను కోరారు. కేరళలో ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో నలుగురు మృతి చెందారు.
 

click me!