భారీ వర్షాలు, వరదలు: వణుకుతున్న ఉత్తరాది..28 మంది మృతి

By Siva KodatiFirst Published Aug 19, 2019, 9:12 AM IST
Highlights

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌ రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా.. భారీగా ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 28 మంది మరణించగా.. 22 మంది గల్లంతయ్యారు

గత కొద్దిరోజులుగా దక్షిణాదిని వణికిస్తోన్న వరదలు ఇప్పుడు ఉత్తర భారతంపై ప్రభావాన్ని చూపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌ రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి.

పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా.. భారీగా ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 28 మంది మరణించగా.. 22 మంది గల్లంతయ్యారు. పంజాబ్‌లో భారీ వర్షాల కారణంగా యమున, సట్లెజ్, బియాస్ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

అటు హిమాచల్‌ప్రదేశ్‌లో మిగిలిన రాష్ట్రాల కంటే భయంకరంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు.. కొండ చరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 18 మంది మరణించారు.

పరిస్థితి తీవ్రత దృష్ట్యా సిమ్లా, కులు జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వరదల ధాటికి కులు సమీపంలోని వంతెన కొట్టుకుపోయింది.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల ఇళ్లు కొట్టుకుపోయాయి. వరదల్లో 22 మంది గల్లంతయ్యారు. చార్‌ధామ్, కైలాస్-మానస సరోవర్ మార్గాల్లో కొండ చరియలు విరిగిపడుతుంటంతో యాత్రికులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. 

click me!