heavy rain: దేశ రాజ‌ధానిలో భారీ వ‌ర్షాలు.. ఆరెంజ్ అల‌ర్ట్ జారీ

By Mahesh RajamoniFirst Published Jul 6, 2022, 9:58 AM IST
Highlights

Delhi rainfall: దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాన‌లు దంచికొడుతున్నాయి. బుధ‌వారం ఉద‌యం నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. 
 

India Meteorological Department: రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో దేశ‌వ్యాప్తంగా విస్తారంగా వాన‌లు కురుస్తున్నాయి. కొన్ని ప్రంతాల్లో భారీవ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. బుధ‌వారం ఉద‌యం నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షం కార‌ణంగా.. అనేక ప్రాంతాలు నీట‌మునిగాయి. ఈ క్ర‌మంలోనే ఢిల్లీలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. IMD ముందుగా మంగళవారం ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుండి భారీ వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని హెచ్చరించింది.

IMD వాతావరణ హెచ్చరికల కోసం నాలుగు రంగు కోడ్‌లను ఉపయోగిస్తుంది, ఆకుపచ్చ (చర్య అవసరం లేదు), పసుపు ( ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తూ.. నవీకరించడం), నారింజ (సిద్ధంగా ఉండండి), ఎరుపు (చర్యలు తీసుకోవాల‌ని) హెచ్చ‌రిక‌లు ఉన్నాయి. మరో రెండ్రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 72 గంటల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆపై తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం ఢిల్లీలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీల సెల్సియస్, 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి వర్షపాతం నమోదైంది, నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 35.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆదివారం నాడు 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని  IMD వెల్ల‌డించింది. 

భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం జూలైలో భారతదేశం దీర్ఘకాల సగటులో 94% నుండి 106% మధ్య రుతుపవనాల వర్షపాతం పొందే అవకాశం ఉంది. జూన్‌లో దేశంలోని మధ్య ప్రాంతాలలో రుతుపవనాలు తక్కువగా ఉన్నందున దేశంలో సగటు కంటే 8% తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై 1న రుతుపవనాలు ఢిల్లీకి చేరుకున్నాయి. దీంతో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో జూలై, ఆగస్టు నెలల్లో పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు, కొంకణ్, గోవా, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, తూర్పు రాజస్థాన్‌లలో పెద్దఎత్తున‌ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Extremely heavy rain forecast issued by IMD for & for Thursday & Friday (July 7-8) pic.twitter.com/8M1R0rmLsT

— Richa Pinto (@richapintoi)

ఇటు దేశ  ఆర్ధిక రాజధాని ముంబయిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం కూడా హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జోరువానలు మొదలయ్యాయి. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ విభాగం వెల్లడించింది. 

click me!