బెంగళూరులో మరోసారి కుండపోత.. జలదిగ్భంధంలో పలు ప్రాంతాలు.. ఎల్లో అలర్ట్ జారీ..

Published : Oct 20, 2022, 09:49 AM ISTUpdated : Oct 20, 2022, 09:53 AM IST
బెంగళూరులో మరోసారి కుండపోత.. జలదిగ్భంధంలో పలు ప్రాంతాలు.. ఎల్లో అలర్ట్ జారీ..

సారాంశం

కర్ణాటక రాజధాని బెంగళూరు మరోసారి జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బెంగళూరులోని సెంట్రల్, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. 

కర్ణాటక రాజధాని బెంగళూరు మరోసారి జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బెంగళూరులోని సెంట్రల్, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుండపోత వర్షంతో పలు చోట్ల నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది. భారీ వర్షం కారణంగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో రోడ్డుపై పార్క్ చేసిన పలు కార్లు ధ్వంసమయ్యాయి. రాబోయే మూడు రోజుల పాటు బెంగళూరుతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఎల్లో అలర్ట్ జారీచేసింది. 

కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు పర్యవేక్షణ కేంద్రం ప్రకారం..హెచ్‌ఏఎల్ విమానాశ్రయం, మహదేవపురా, దొడ్డనేకుండి, సీగేహళ్లి వంటి నగరానికి తూర్పు ప్రాంతాలలో రాత్రి 8 గంటల నుంచి అర్దరాత్రి వరకు 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని ఉత్తర ప్రాంతంలోని రాజమహల్ గుట్టహళ్లిలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్, జేసీ రోడ్డు, శివాజీనగర్, ఆర్‌టీ నగర్, బన్నేరుఘట్ట రోడ్, వైట్‌ఫీల్డ్, జేపీ నగర్.. తదితర ప్రాంతాల్లో రోడ్లు, అండర్‌పాస్‌లలో భారీగా నీరు నిలిచిపోయింది.

 


బెంగళూరులో వర్షాలకు సంబందించి సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వీడియోలు.. చాలా చోట్ల వరద నీటితో నిండిన రోడ్లు, ఓపెన్ మ్యాన్‌హోల్స్‌లోకి నీరు ప్రవహించడం, బేస్‌మెంట్ పార్కింగ్‌లోకి నీరు చేరడం, దెబ్బతిన్న వాహనాల దృశ్యాలను చూపిస్తున్నాయి. సాయంత్రం 7. 30 గంటల ప్రాంతంలో భారీ వర్షం ప్రారంభం కావడంతో.. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారు మెట్రో స్టేషన్లలో తలదాచుకోవలసి వచ్చింది.

 


ఇక, గత నెలలో వరుసగా మూడు రోజుల పాటు భారీవర్షం కురవడంతో బెంగళూరు నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. గ్లోబల్ ఐటి కంపెనీలు, స్వదేశీ స్టార్ట్-అప్‌లు ఉన్న బెంగళూరులో కొన్ని ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులు సకాలంలో కంపెనీలకు చేరుకోలేకపోయారు. భారీ వర్షాల కారణంగా ఐటీ సంస్థలకు భారీ నష్టం వాటిలినట్టుగా వెలుగుచూసింది. కొందరు ప్రజలను ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ ప్రభావం నుంచి బెంగళూరు బయటపడటానికి కొన్ని రోజుల సమయం పట్టింది. ఇప్పుడు మరోమారు బెంగళూరుకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్