ఆర్టీసీ బస్సు కోసం మంత్రి పరుగులు.. ఏంటి మ్యాటర్..?

By telugu news teamFirst Published Jan 11, 2021, 9:28 AM IST
Highlights

కారులో వెళుతుండగా కొరటగెరె దగ్గర కొందరు విద్యార్థులు బస్టాప్ దగ్గర నిల్చుని ఉండటాన్ని మంత్రి గమనించారు. అప్పుడే మంత్రి కారును దాటుకుంటూ ఓ ఆర్టీసీ బస్సు అటుగా వెళ్లింది. 

మంత్రి హోదాలో ఉన్న వారికి ఆర్టీసీ బస్సుతో పని ఏమంటుంది..?  హాయిగా.. ఏసీ కార్లలో తిరుగుతారు. కదా.. కానీ ఓ మంత్రి మాత్రం.. ఆర్టీసీ బస్సు కోసం ఏకంగా ఛేజ్ చేశారు. కారులో ఛేజ్ చేసి మరీ బస్సును ఆపారు. అయితే.. అది ఆయన ఎక్కడం కోసం కాదులేండి.. విద్యార్థల కోసం. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా భయంతో మొన్నటి వరకు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు జరిగాయి. ఇటీవలే ఆఫ్ లైన్ క్లాసులు మొదలుపెట్టారు. ఆఫ్‌లైన్ క్లాసులు మొదలవడంతో కర్ణాటకలో ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. అయితే.. కొన్ని రూట్లలో కేఎస్‌ఆర్టీసీ బస్సులు విద్యార్థులు వేచి చూస్తూ కనిపిస్తున్నప్పటికీ ఆగకుండా వెళ్లిపోతున్నాయి. 

దీంతో.. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం సవాల్‌గా మారింది. అధికారులకు విద్యార్థులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సందర్భంలోనే.. కర్ణాటక విద్యా శాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ శనివారం ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి తుమకూరు వెళుతున్నారు.

కారులో వెళుతుండగా కొరటగెరె దగ్గర కొందరు విద్యార్థులు బస్టాప్ దగ్గర నిల్చుని ఉండటాన్ని మంత్రి గమనించారు. అప్పుడే మంత్రి కారును దాటుకుంటూ ఓ ఆర్టీసీ బస్సు అటుగా వెళ్లింది. ఆ విద్యార్థులు బస్సును ఆపాలని కోరినప్పటికీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటనను కళ్లారా చూసిన మంత్రి సురేష్ ఆ బస్సును వెంబడించాలని కారు డ్రైవర్‌కు సూచించాడు. 

కారుతో బస్సును ఛేజ్ చేసిన మంత్రి ఆ బస్సును అడ్డగించి డ్రైవర్‌పై, కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్య ధోరణిపై ఇద్దరికీ క్లాస్ పీకారు. వివరణ అడగడం మాత్రమే కాదు.. స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల కోసం తప్పనిసరిగా బస్సును ఆపాలని ఆదేశించారు. ఈ ఘటన.. కేఎస్‌ఆర్‌సీ దృష్టికి కూడా వెళ్లింది. ఈ ఘటన గురించి స్థానిజ డివిజన్ కార్యాలయం ఆరా తీస్తోందని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని కేఎస్‌ఆర్‌టీసీ ట్వీట్ చేసింది. మంత్రి చూపిన చొరవను పలువురు ప్రశంసించారు.
 

click me!