నన్ను చంపబోయారు.. ఆసుపత్రిలో హత్రాస్ బాధితురాలి మాటలు, వీడియో వైరల్

By Siva KodatiFirst Published Oct 4, 2020, 2:38 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో 19ఏళ్ల దళిత యువతి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెల్సిందే. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విపక్షాలు, మహిళా, ప్రజా సంఘాలు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో 19ఏళ్ల దళిత యువతి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెల్సిందే. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విపక్షాలు, మహిళా, ప్రజా సంఘాలు రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిరాతకులు తనను గొంతు నులిమి చంపబోయారంటూ బాధిత బాలిక చెబుతున్న వీడియో సంచలనం కలిగిస్తోంది.

అలీగఢ్‌ మెడికల్ యూనివర్శిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దళిత బాలిక చెబుతున్న వీడియోను బీజీపీ ఐటీ సెల్‌ విభాగం అధిపతి అమిత్‌ మాల్వియా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 

అత్యాచారం, హత్యాయత్నం కేసులో తీవ్రంగా గాయపడిన దళిత యువతి సెప్టెంబర్‌ 29న ఢిల్లీ ఆస్పత్రిలో మరణించగా, అంతకుముందు ఆమె మీడియా ప్రతినిథికి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో క్లిప్పింగ్‌ను అమిత్‌ మాల్వియా అక్టోబర్‌ రెండవ తేదీన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

మరోవైపు అత్యాచారం కేసులో బాధితురాలి పేరును బహిర్గతం చేయడం నేరం. ఆ దళిత యువతిపై నిజంగా అత్యాచారం జరిగిన పక్షంలో అమిత్‌ మాల్వియాపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ హెచ్చరించారు.

ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు మాల్వియాతో తాను స్వయంగా మాట్లాడుతానని కమీషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ వెల్లడించారు. ఈమె వ్యాఖ్యలకు మద్ధతు తెలుపుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమీషన్ చీఫ్ విమ్లా బాతమ్ కూడా మాల్వియాను హెచ్చరించారు.

అయితే బీజేపీ మహిళా మోర్చా, సోషల్ మీడియా చీఫ్ ప్రీతి గాంధీ మాత్రం మాల్వియాను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.  మాల్వియా విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్‌లో దళిత యువతి తనపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపించారు తప్పా, అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు చేయలేదని ఆమె పేర్కొన్నారు.

అయితే నకిలీ వార్తలను ప్రచారం చేయడంలో సుప్రసిద్ధుడైన అమిత్ మాల్వియా ఉద్దేశపూర్వకంగానే అత్యాచారం ఆరోపణలను తొలగించి దళిత యువతి వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారని కాంగ్రెస్ సహా దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

click me!