మత తటస్థ దేశంలో విద్వేష ప్రసంగాలు ఊహించలేం.. వారిపై యాక్షన్ తీసుకోండి లేదంటే కోర్టును ధిక్కరించినట్టే: సుప్రీం

By Mahesh KFirst Published Oct 21, 2022, 5:32 PM IST
Highlights

భారత దేశం లౌకిక, మత తటస్థ దేశం అని సుప్రీంకోర్టు వివరించింది. విద్వేష నేరాలు, విద్వేష ప్రసంగాలతో దేవుడికి ఎంతకి కుదించేశారు కదా? అని పేర్కొంది. ఇది 21వ శతాబ్దం అని, మతం పేరిట మనం ఎక్కడికి చేరుకున్నాం అంటూ ఫైర్ అయింది.
 

న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది వరకు చేయని రీతిలో బలమైన వ్యాఖ్యలు చేసింది. ‘ఇది 21వ శతాబ్దం. మతం పేరిట మనం ఎక్కడ దాకా చేరుకున్నాం?’ అంటూ సీరియస్ అయింది. మతపరంగా తటస్థ వైఖరి అవలంబించాల్సిన దేశంలో ఇలాంటి విద్వేష ప్రసంగాలు రావడం షాకింగ్‌గా ఉన్నది. 

భారత దేశంలో ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేసి, టెర్రరైజ్ చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయని, ఈ ముప్పును అరికట్టడానికి వెంటనే జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషనర్ షహీన్ అబ్దుల్లా ఓ పిటిషన్ వేశారు. దీనిపై స్పందించాలని కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు గురువారం కోరింది.

ఈ పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాలకు పాల్పడుతున్న వారిపై యాక్షన్ తీసుకోవాలని వాదించారు. హేట్ క్రైమ్స్, హేట్ స్పీచ్‌లను అరికట్టడానికి యూఏపీఏ వంటి కఠిన చట్టాలను ప్రయోగించాలని పిటిషనర్ కోరారు. దేశవ్యాప్తంగా జరిగిన హేట్ క్రైమ్స్, హేట్ స్పీచెస్‌లపై స్వతంత్ర, విశ్వసనీయ, నిష్పక్షపాత విచారణ చేపట్టాలని పిటిషనర్ పేర్కొన్నారు.

Also Read: మతాలు ద్వేషాన్ని నేర్పవు.. భిన్నమతాలైనా అవే మనందరినీ కలిపి ఉంచుతాయి: ఫరూఖ్ అబ్దుల్లా

ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తున్నది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఇలాంటి ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ఆ రాష్ట్రాల పోలీసు చీఫ్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాలకు పాల్పడే వారిపై (మతాలకు అతీతంగా) తీసుకున్న చర్యలు వివరించాలని పేర్కొంది. విద్వేష ప్రసంగాలు ఇచ్చిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం జూనియర్ ఆఫీసర్లను ఆదేశించింది. విద్వేష ప్రసంగాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాలని తాజాగా  వార్నింగ్ ఇచ్చింది. ఈ చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై కోర్టు ధిక్కరణ అభియోగాలు మోపబడతాయని హెచ్చరించింది. 

మనం దేవుడిని ఎంతకు కుదించేశాం కదా? అని నిట్టూర్చింది. ఇండియా ఒక లౌకిక దేశం అని, మత తటస్థ దేశం అని కోర్టు తెలిపింది. ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నదని వివరించింది.

ఈ విచారణ సందర్భంగా కపిల్ సిబల్ ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన హిందూ సభను ఉదహరించారు. ఈ సభలో వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ వారిని (ముస్లింలు!) పూర్తిగా బాయ్‌కాట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మరో వక్త జగత్ గురు యోగేశ్వర్ ఆచార్య వ్యాఖ్యలను న్యాయమూర్తులు చదివారు. మన ఆలయాలపై వేలు ఎత్తితే వారి గొంతులు తెగ్గోయాలని ఆ సభకు హాజరైన వారికి ఆయన పిలుపు ఇచ్చారు.

పోలీసులు, ప్రభుత్వాలు వెంటనే వీటిపై స్వయంగా కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు కపిల్ సిబల్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇది మా బాధ్యత అని, లేదంటే మేం మా బాధ్యతను నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది’ అని జడ్జీలు అన్నారు.

click me!