వ్యాక్సిన్‌కు వాలంటీర్‌: టీకా తీసుకున్న హర్యానా మంత్రికి కరోనా

By Siva KodatiFirst Published Dec 5, 2020, 2:36 PM IST
Highlights

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని దేశం మొత్తం ఆశగా ఎదురు చూస్తున్న వేళ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కొవాగ్జిన్ టీకా ప్రయోగాల్లో పాల్గొన్న హర్యానా మంత్రి అనిల్ విజ్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని దేశం మొత్తం ఆశగా ఎదురు చూస్తున్న వేళ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కొవాగ్జిన్ టీకా ప్రయోగాల్లో పాల్గొన్న హర్యానా మంత్రి అనిల్ విజ్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా శనివారం వెల్లడించారు. ప్రస్తుతం తాను అంబాలాలోని సివిల్ హాస్పిటల్‌లో చేరినట్టు తెలిపారు. కొవాగ్జిన్ టీకా తొలి డోస్ వేయించుకున్న రెండు వారాలకే ఆయనకు వైరస్ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది.

తనను కలిసి ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని అనిల్ విజ్ఞ‌ప్తి చేశారు. మరోవైపు టీకా వేయించుకున్న అనిల్ విజ్‌కు కరోనా వైరస్ సోకడంపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది.

కాగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దేశవ్యాప్తంగా నవంబరు 20న ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలి డోసును మంత్రి అనిల్ విజ్ నవంబరు 20న తీసుకున్నారు.

అంబాలాలోని కోవిడ్ ఆసుపత్రిలో ఆయ‌న కోవిడ్ టీకాను వేయించుకున్నారు. రాష్ట్రంలో కొవాగ్జిన్ ట్రయల్స్‌లో మొదటి వాలంటీర్‌గా ఆయన టీకాను తీసుకున్నారు. 

ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు మొదట ఓ ఇంజెక్షన్ ఇస్తారు. అనంతరం కొన్ని రోజుల విరామం తర్వాత మరో ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంట్రామస్కులర్‌ ఇంజెక్షన్లను 28 రోజుల తేడాతో ఇస్తున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న రైతులపై కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీకి చెందిన ముగ్గురు ప్రతినిధులు హోం మంత్రి అనిల్ విజ్‌ను శుక్రవారం కలిశారు. మరోవైపు ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా కూడా ఆయనను కలిశారు.

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated Dec 5, 2020, 2:36 PM IST