గల్ఫ్ మోసగాళ్ల చెరలో చిక్కుకున్న యువతి.. కాపాడిన హర్భజన్ సింగ్..భేష్ భజ్జీ అంటూ ప్రశంసలు

By Bukka SumabalaFirst Published Sep 8, 2022, 11:59 AM IST
Highlights

ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన ఒమన్ కు వెళ్లి అక్కడ మోసగాళ్ల చెరలో చిక్కిన ఓ 21 యేళ్ల పంజాబీ యువతిని మాజీ క్రికెటర్ కాపాడారు. తిరిగి స్వదేశానికి రప్పించారు. 

పంజాబ్ : భారత మాజీ క్రికెటర్  హర్భజన్ సింగ్ పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. దీనికి కారణం ఆయన చేసిన ఓ మంచి పని. ఏజెంట్ మోసంతో గల్ఫ్ దేశం ఒమన్ లో చిక్కుకున్న 21 ఏళ్ల పంజాబీ యువతిని యజమాని చెర నుంచి కాపాడి స్వదేశానికి తీసుకురావడంలో భజ్జీ కీలకంగా వ్యవహరించారు. అక్కడి నుంచి మన ఎంబసీ సహాయంతో ఆమెను సురక్షితంగా భారత్ కు చేరుకునేలా చేశారు. ఇక ఇటీవల నుంచి ఆయనను అక్కడి అధికార పార్టీ ఆప్  రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఎంపీగా ఉన్న బజ్జీకి ఆప్ నేతల ద్వారానే ఒమన్ లో చిక్కుకున్న యువతి విషయం తెలిసింది.  

వెంటనే ఆయన చొరవ తీసుకుని స్వదేశానికి తీసుకు వచ్చే ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే పంజాబ్ కు చెందిన కమల్జీత్ (21) తండ్రి సికిందర్ సింగ్ దినసరి కూలీ. ఆయనకు ముగ్గురు కూతుళ్లు. వారిలో పెద్దమ్మాయే కమల్జీత్.  తండ్రికి వచ్చే సంపాదన అంతంత మాత్రమే కావడంతో తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కమల్జీత్ నిర్ణయించుకుంది. దీంతో స్థానికంగా ఉండే ఏజెంట్ జసీర్ సింగ్ ను కలిసింది. తనకు విదేశాల్లో ఏదైనా పని ఉంటే చూపించాలని కోరింది. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ఏజెంట్ జసీర్  మోసపూరితంగా ఆమెను ఒమన్ కు పంపించే ఏర్పాటు చేశాడు.  అక్కడ ఉండే ఓ హిందూ ఫ్యామిలీ వద్ద వంట చేసి పెట్టాలి అని చెప్పాడు.

అమిత్ షా పర్యటనలో భారీ భద్రతా లోపం.. ఆంధ్రప్రదేశ్ ఎంపీ పీఏ అని చెప్పుకొని చక్కర్లు కొట్టిన వ్యక్తి అరెస్ట్..

మంచి జీతం, వసతి ఉంటాయని బుకాయించాడు. అక్కడ నువ్వు మంచిగా పని చేసుకుంటే.. సిక్కు కమ్యూనిటీ ఎక్కువగా ఉండే కెనడా,  ఆస్ట్రేలియాకు పంపిస్తామని నమ్మబలికాడు. జసీర్ మాటలు నమ్మిన కమల్జీత్ అతగాడి సూచనతో గత నెలలో ఒమన్ వెళ్ళింది. కానీ,  అక్కడికి వెళ్ళాక ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కమల్జీత్ ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఆమెను తీసుకు వెళ్లి ఓ రూంలో బంధించాడు. ఆమె పాస్పోర్ట్, సిమ్ కార్డు లాక్కున్నాడు. ఆ తర్వాత ఆమెకు బుర్ఖా వేసి.. అరబ్బీ నేర్చుకోవాలని బలవంతం చేశాడు.  దాంతో తాను మోసపోయానని గ్రహించిన కమల్జీత్ ఎలాగోలా అతని చెర నుంచి బయటపడింది. ఆ తరువాత ఓ కొత్త సిమ్ కార్డు కొని.. తండ్రికి ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని తెలియజేసింది.

కూతురు తెలిపిన సమాచారంతో తండ్రి సికిందర్ సింగ్ వెంటనే ఏజెంట్ సికిందర్ ను కలిశాడు. తన కూతురుని స్వదేశానికి రప్పించాలని కోరాడు. దానికి అతగాడు ఏకంగా రూ గా.2.5లక్షలు  డిమాండ్ చేశాడు. చేసేదిమీ లేక తన ఇంటిని తాకట్టు పెట్టి ఏజెంట్ కు ఆ నగదును ఇచ్చాడు. ఆ తర్వాత తన బంధువైన ఆప్ నేత ద్వారా ఈ విషయాన్ని హర్భజన్ దృష్టికి తీసుకు వెళ్ళాడు. వెంటనే స్పందించిన భజ్జి మస్కట్ లోని భారత ఎంబసీ అధికారులకు ఫోన్ ద్వారా విషయాన్ని తెలియజేశాడు. 

దీంతో ఎంబసీ అధికారులు రంగంలోకి దిగి తన స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.  అలా హర్భజన్ సింగ్  ఎంబసీ  అధికారుల సహాయంతో కమల్జీత్ తాజాగా పంజాబ్ కు చేరుకుంది. ఈ సందర్భంగా భజ్జితోపాటు ఎంబసీ అధికారులకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది. తిరిగి స్వదేశానికి వస్తానని అనుకోలేదని.. ఎంపీ హర్భజన్ సహాయం ఎప్పటికి మరచిపోలేనని కమల్జీత్ చెప్పు వచ్చింది. ఇక బజ్జీ మాట్లాడుతూ ఆప్ నేతల ద్వారా విషయం తెలుసుకుని తనవంతు సాయం చేసినట్లు తెలిపారు. ఇందులో ఎంబసీ అధికారులు కీలకంగా వ్యవహరించారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు, అందులోనూ ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలని భజ్జీ సూచించారు. 

click me!