అమిత్ షా పర్యటనలో భారీ భద్రతా లోపం.. ఆంధ్రప్రదేశ్ ఎంపీ పీఏ అని చెప్పుకొని చక్కర్లు కొట్టిన వ్యక్తి అరెస్ట్..

By Sumanth KanukulaFirst Published Sep 8, 2022, 11:40 AM IST
Highlights

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో భారీ భద్రత లోపం వెలుగుచూసింది. హోం మంత్రిత్వ శాఖ అధికారిగా నటిస్తూ ఓ వ్యక్తి గంటల తరబడి అమిత్ షా చుట్టూ తిరిగాడు. ఆ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో భారీ భద్రత లోపం వెలుగుచూసింది. అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి వెళ్లారు. ఆ పర్యటన బుధవారంతో ముగిసింది. ముంబైలో అమిత్ షా పర్యటిస్తున్న సమయంలో భద్రతా లోపం చోటుచేసుకుంది. హోం మంత్రిత్వ శాఖ అధికారిగా నటిస్తూ ఓ వ్యక్తి గంటల తరబడి అమిత్ షా చుట్టూ తిరిగాడు. ఆ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. అమిత్ షా ముంబైలో పర్యటించిన ప్రాంతాల్లో ఓ వ్యక్తి గంటల పాటు తిరిగాడు. అతడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇళ్ల వెలుపల కూడా కనిపించాడు. 

దీంతో అనుమానం వచ్చిన హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు.. అతడి పేరు, గుర్తింపు గురించి ప్రశ్నించారు. అప్పుడు అతడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంట్ సభ్యుని పీఏ అని చెప్పాడు. అతని సమాధానంతో ఆ అధికారి సంతృప్తి చెందలేదు. వెంటనే ఈ విషయంపై ముంబై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగారు. హోంమంత్రి భద్రతా బృందం జాబితాలో అతడి పేరు లేదని కూడా పోలీసులు గుర్తించారు. మూడు గంటల్లోనే అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అమిత్ షా చుట్టూ తిరుగుతున్న సమయంలో.. అతడు MHA అని వ్రాసిన రిబ్బన్‌ను ధరించాడు. దాని కారణంగా పోలీసులకు అతనిపై అనుమానం రాలేదు. 


అరెస్ట్ చేసిన వ్యక్తిని మహారాష్ట్రలోని ధూలేకు చెందిన హేమంత్ పవార్‌గా గుర్తించారు. అనతరం అతడిని కోర్టులో హాజరుపరిచి ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. అతడు ఏ ఉద్దేశంతో అమిత్ షా కాన్వాయ్ చుట్టూ తిరిగారనే వివరాలను ఆరా తీస్తున్నారు. అమిత్ షా పర్యటనలో హేమంత్ పవార్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే అధికారిగా నటించారని పోలీసులు తెలిపారు. 

ఇక, మహారాష్ట్రలో బీజేపీ మద్దతు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమిత్ షా తొలిసారిగా ముంబై పర్యటనకు వచ్చారు. తన పర్యటనలో అమిత్ సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ల నివాసాలను కూడా సందర్శించారు. నగరంలోని ప్రధాన గణేష్ పండల్ లాల్‌బాగ్చా రాజా వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

click me!