UP Elections 2022: ఓట్లు వేయండి.. నోట్లూ మీరే ఇయ్యండి.. అభ్యర్థి విచిత్ర ప్రచారం

Published : Feb 06, 2022, 05:21 PM IST
UP Elections 2022: ఓట్లు వేయండి.. నోట్లూ మీరే ఇయ్యండి.. అభ్యర్థి విచిత్ర ప్రచారం

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఫిరోజాబాద్ అభ్యర్థి వినూత్న ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా అభ్యర్థులు ఓట్లు రాబట్టడానికి డబ్బులు, మద్యం పంచుతుంటారు. రకరకాల వాగ్దానాలతో ప్రలోభపెడుతుంటారు. కానీ, ఫిరోజాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్న రాందాస్ మానవ్ ప్రజల నుంచే డబ్బు కోరుతున్నారు. ఓట్లేయండి.. నోట్లూ వేయండి అంటూ ప్రచారం చేస్తున్నారు.  

లక్నో: ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. ఆకట్టుకునే ప్రసంగాలు, చేష్టలు చేస్తుంటారు. ఒక్కోసారి పిల్లలకు స్నానాలు చేస్తుంటారు. డబ్బులు ఇస్తుంటారు. మద్యం రహస్యంగా చేతుల్లో పెట్టి ప్రలోభ పెడుతుంటారు. ఒక్కోసారి ఒక సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఆఫర్లు ప్రకటిస్తుంటారు. లేదా రెచ్చగొట్టే మాటలూ మాట్లాడుతుంటారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లో ఓ అభ్యర్థి సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. ఆయన ఓటర్లను ప్రలోభ పెట్టడం పక్కన పెట్టి.. వారి నుంచే ఓట్లు(Votes) అడుగుతున్నాడు.. నోట్లూ(Notes) అడుగుతున్నాడు. ఫిరోజాబాద్(Firozabad) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాందాస్ మానవ్ ఈ పంథాను అవలంబించారు.

రాందాస్ మానవ్ యూపీలోని ఓ గాజుల ఫ్యాక్టరీలో కార్మికుడు. బ్యాంగిల్ వర్కర్స్ యూనియన్ నేత. బ్యాంగిల్ ఫ్యాక్టరీ(Bangle Factory)ల్లో కార్మికులను యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయని ఆయన భావిస్తున్నారు. వారి స్థితిగతులను మెరుగు పరచాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నికల బరిలోకి స్వతంత్రంగా దిగారు. ఆయన ఎన్నికల గుర్తు కూడా గాజులే. గాజు గుర్తుకే ఓటు వేయాలని ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే, ఆయన స్వతహాగా ఓ కార్మికుడు కాబట్టి, ఎన్నికల ప్రచారంలో డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితులు లేవు. ప్రలోభ పెట్టడానికీ ఆయన దగ్గర కాసులేమీ లేవు. దీంతో ఆయన మిగతా అభ్యర్థులకు భిన్నమైన విధానాన్ని ఎంచుకున్నారు.

ఆయన చేతులకు బేడీలు వేసుకుని ఒళ్లంతా ఇనుప కంచె చుట్టుకుని ప్రజల్లోకి ప్రచారానికి వెళ్తున్నారు. చేతిలో ఓ గిన్నె తీసుకుని తిరుగుతున్నారు. ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న కార్మికులు ఇలాగే ఇనుప కంచెలతో బంధీలై ఉన్నారని రాందాస్ మానవ్ అన్నారు. కార్మికులు ఇనుప కంచెలు, బేడీల్లో బంధీలుగా ఉన్నారని వివరించారు. కార్మికులు ఎప్పుడైతే ఈ కంచెలను తెంచుకుంటారో అప్పుడే వారికి విముక్తి అని తెలిపారు. వారందరినీ ఈ ఇనుప కంచెల నుంచి విముక్తం చేసిన తర్వాతే తాను ఈ బేడీలు, ఇనుప కంచెలను తొలగించుకుంటానని పేర్కొన్నారు. కాబట్టి, ఆయన కార్మికులు ఉండే చోటకు వెళ్లినప్పుడు ఆ వర్కర్లే ఆయనకు బౌల్‌లో నోట్లు వేస్తున్నారు. డబ్బులు వేసి ఆ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారు.

ఫిరోజాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు ఉత్తరప్రదేశ్ మూడో విడతలో జరగనున్నాయి. ఈ నెల 20వ తేదీన ఈ ఎన్నికలు జరుగుతాయి.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu