బూస్టర్ డోసుగా స్పుత్నిక్ లైట్.. ప్రభుత్వానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రతిపాదన

Published : Feb 06, 2022, 04:08 PM IST
బూస్టర్ డోసుగా స్పుత్నిక్ లైట్.. ప్రభుత్వానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రతిపాదన

సారాంశం

భారత్ దేశంలో బూస్టర్ డోసుగా త్వరలో స్పుత్నిక్ లైట్ రానున్నది. ఇప్పటికే ఈ టీకాను అత్యవసర వినియోగ సమయంలో పంపిణీ చేయడానికి అనుమతులు ఉన్నాయి. తాజాగా, స్పుత్నిక్ వీ టీకా కోసం స్పుత్నిక్ లైట్‌ను బూస్టర్ డోసుగా అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ దరఖాస్తు పెట్టుకుంది. దీనిపై ఇంకా భారత ప్రభుత్వ రెగ్యులేటరీ స్పందించాల్సి ఉన్నది.   

న్యూఢిల్లీ: మన దేశంలో కొవిషీల్డ్(Covishield), కొవాగ్జిన్‌(Covaxin)లతో పాటు ఆ తర్వాత స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్(Sputnik Light Vaccine) కూడా ఎక్కువ మంది తీసుకున్నారు. రష్యా ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ టీకా ప్రపంచంలోని చాలా దేశాల్లో పంపిణీ చేస్తున్నారు. కాగా, మన దేశంలోనూ కరోనా టీకా రెండు డోసుల పంపిణీ దాదాపు ముగుస్తుండగా.. బూస్టర్ డోసు కూడా పంపిణీ ప్రారంభం అయింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను మూడో డోసుగా పంపిణీ చేస్తున్నారు. కాగా, స్పుత్నిక్ లైట్ టీకానూ బూస్టర్ డోసుగా పంపిణీ చేయాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ(Doctor Reddys Lab) కేంద్రానికి ప్రతిపాదన పెట్టింది. 

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. 2020 సెప్టెంబర్‌లోనే ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఆర్‌డీఐఎఫ్‌కు చెందిన స్పుత్నిక్ లైట్ టీకాను మన దేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ పంపిణీ చేస్తున్నది. భారత్‌లో అత్యవసర సమయంలో పంపిణీ చేసే అనుమతులను భారత రెగ్యులేటరీ సంస్థ డీసీజీఐ రెడ్డీస్ ల్యాబ్‌కు ఇచ్చింది. రష్యా నుంచి ఈ టీకాలను భారత్‌కు అనుమతి చేసుకునే అనుమతులను రెడ్డీస్ ల్యాబ్ పొందిన సంగతి తెలిసిందే. 

కాగా, బూస్టర్ డోసు విషయమై డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సీఈవో ఎరెజ్ ఇజ్రాయెలీ ఓ ప్రకటన చేశారు. భారత్‌లో తాము స్పుత్నిక్ లైట్ టీకాల నిల్వలతో సంసిద్ధంగా ఉన్నామని వివరించారు. స్పుత్నిక్ లైట్‌ను టీకాగా రిజిస్టర్ చేయడానికి, దాన్ని స్పుత్నిక్ వీ టీకాకు బూస్టర్ డోసుగా వేయడానికి అనుమతులు ఇవ్వాలని రెగ్యులేటరీకి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్పుత్నిక్ టీకా భారత్ సహా ఇతర దేశాలకూ సానుకూలమైన ఒక అవకాశం అని వివరించారు. అయితే, ఇందుకోసం ట్రయల్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉన్నదని పేర్కొన్నారు.

ఇతర టీకాలతోపాటు తమ టీకాకూ ట్రయల్‌కు అనుమతులు ఇస్తే.. బూస్టర్ డోసు కోసం మరో అవకాశం భారత్‌లో ఉంటుందని తెలిపారు. ప్రైవేటులోను, కేంద్ర ప్రభుత్వానికీ ఇదొక సదావకాశంగా ఎప్పుడూ స్పుత్నిక్ టీకా ఉంటుందని వివరించారు.

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో రష్యా(Russia) ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఆ దేశం అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ(Sputnik V) టీకా ఒమిక్రాన్ వేరియంట్‌ను ప్రభావవంతంగా ఎదుర్కోగలదని వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను నాశనం చేసే సామర్థ్యం గమలేయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ టీకాకు ఉన్నదని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో తయారు చేసిన టీకాలు సహా ఇతర అన్ని టీకాల కంటే మూడు నుంచి ఏడు రెట్లు అధిక సామర్థ్యం స్పుత్నిక్ వీ టీకాకు ఉన్నదని వివరించింది. కాగా, స్పుత్నిక్ వీ లైట్ వెర్షన్ టీకా 80 ఎఫికసీని ప్రదర్శించినట్టు తెలిపింది. బలమైన, దీర్ఘకాలం పని చేసే టీ సెల్స్ ప్రతిస్పందనను కలిగించే శక్తి స్పుత్నిక్ వీ టీకాకు ఉన్నదని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్‌లోని ఉత్పరివర్తనాలు టీ సెల్స్‌లోని 80 శాతం ఎపిటోప్స్‌ను ఏమీ చేయలేకపోయాయని తెలిపింది.

కాగా, స్పుత్నిక్ లైట్ వెర్షన్ టీకా బూస్టర్‌గా మెరుగైన ఫలితాలను ఇచ్చిందని రష్యా ప్రభుత్వం తెలిపింది. స్పుత్నిక్ లైట్ బూస్టర్‌గా వేసుకున్నాక రెండు మూడు నెలల తర్వాత ఒమిక్రాన్ వేరియంట్‌ను సమర్థవంతంగా నాశనం చేస్తున్నట్టు అధ్యయనంలో తేలిందని వివరించింది. ఇలా స్పుత్నిక్ లైట్ టీకా బూస్టర్‌గా రెండో సారి వేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని తెలిపింది. స్పుత్నిక్ లైట్‌తో పోల్చితే ఫైజర్‌ టీకా 25 శాతం మాత్రమే ప్రభావాన్ని చూపెట్టిందని వివరించింది.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !