
H3N2 flu-influenza virus: హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మార్చి 16 నుంచి మార్చి 26 వరకు 8వ తరగతి వరకు విద్యార్థుల పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పుదుచ్చేరిలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలకు వర్తించేలా మంత్రి ఏ.నమశ్శివాయం అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. 18 ఏళ్ల లోపు పిల్లలు వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రంగస్వామికి నివేదిక సమర్పించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "ఆరోగ్య శాఖ నివేదికపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించాము. గత వారం రోజుల్లో సుమారు 400 మందికి హెచ్ 3ఎన్ 2 వైరస్ సోకినట్లు నివేదిక తెలిపింది. బాధితుల్లో అత్యధిక శాతం మంది 18 ఏళ్ల లోపు వారేనని వారు తెలిపారు" అని నమశివాయం పేర్కొన్నారు.
వైరస్ వ్యాప్తి కారణంగా పరిస్థితి దారుణంగానే ఉన్నప్పటికీ.. రోగుల ఆరోగ్యం సీరియస్ గా లేదని తెలిపారు. ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉందని చెప్పారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గుతో బాధపడుతున్నారనీ, ఇలాంటి లక్షణాలకు సాధారణ మందులతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. మార్చి 31 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆరోగ్య శాఖ నివేదిక తెలిపిందనీ, ఈ క్రమంలోనే ఇదే విషయంపై ప్రభుత్వం చర్చించి, వైరస్ వ్యాప్తి కట్టడి, పిల్లల రక్షణ కోసం 8వ తరగతి వరకు అన్ని తరగతుల పిల్లలకు 10 రోజుల పాటు సెలవులువు ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. వైరస్ వ్యాప్తికి సంబంధించిన నివేదిక ఆధారంగా సెలవు ప్రకటించినట్లు నమశివాయం విలేకరులకు తెలిపారు. గత కొద్ది రోజులుగా పుదుచ్చేరిలో ఇన్ ఫ్లూయెంజా వ్యాప్తితో కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.
తమిళనాడులోనూ..
పొరుగున ఉన్న తమిళనాడులో హెచ్3ఎన్2 కేసులను పర్యవేక్షించడానికి ఆరోగ్య శాఖ మార్చి 10 న రాష్ట్రవ్యాప్తంగా 1000 జ్వర శిబిరాలను నిర్వహించింది. ఒక్క చెన్నైలోనే 200 శిబిరాలు నిర్వహించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ బుధవారం మీడియాకు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందనీ, ఇన్ ఫ్లూయెంజా చికిత్సకు రెగ్యులర్ యాంటీబయోటిక్స్ ను ఉపయోగిస్తున్నామని సుబ్రమణియన్ తెలిపారు. రాష్ట్రంలో డెంగ్యూ కూడా అదుపులోనే ఉందన్నారు.
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, హెచ్3ఎన్ 2 అనేది మానవేతర ఇన్ ఫ్లూయెంజా వైరస్.. అయితే, ఇది మొదట మానవులలో 2011 లో కనుగొనబడింది. జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి శ్వాసకోశ సమస్యలు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, గర్భిణులు, ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, నాడీ లేదా న్యూరో డెవలప్మెంటల్ పరిస్థితులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు హెచ్3ఎన్2 వైరస్ కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.