పెళ్లై మూడు నెలలు.. భార్యకు యాసిడ్ తాగించిన భర్త..!

By telugu news teamFirst Published Jul 21, 2021, 9:22 AM IST
Highlights

 బలవంతంగా ఆమె నోట్లో యాసిడ్ కూడా పోశారు. అనంతరం ఆమె ఒంటికి నిప్పు పెట్టారు. తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది

వాళ్లకి పెళ్లై.. కనీసం మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ లోపే ఆమెకు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. భర్త, ఆడపడుచు అదనపు కట్నం తేవాలంటూ వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బలవంతంగా ఆమె నోట్లో యాసిడ్ కూడా పోశారు. అనంతరం ఆమె ఒంటికి నిప్పు పెట్టారు. తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గ్వాలియర్‌లోని డబ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో యువతికి (25) ఈ సంవత్సరం ఏప్రిల్‌ 17వ తేదీన వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే అత్తింటి వారు వేధింపులు మొదలుపెట్టారు. అదనంగా కట్నం తీసుకురావాలని ఆమెపై నిత్యం వేధిస్తున్నారు. భర్త శారీరకంగా తీవ్రంగా హింసించేవాడు. అతడికి తోడుగా అతడి సోదరి కూడా చేరి ఆమెకు నరకం చూపించారు. జూన్‌ 3వ తేదీన వారి ఆగడాలు శ్రుతిమించాయి. ఆ యువతిని తీవ్రంగా కొట్టి భర్త, వదిన కలిసి యాసిడ్‌ తాగించారు. అంతటితో ఊరుకోకుండా అగ్గి పెట్టారు. వాటి దెబ్బకు ఆమె తాళలేక అరుపులు, కేకలు వేసి నరకం అనుభవించింది.

స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో నరకయాతన అనుభవిస్తూ జీవిస్తోంది. యాసిడ్‌ ప్రభావంతో జీర్ణాశయం పూర్తిగా దెబ్బతింది. కడుపు ముందరి భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో వైద్యులు అతికష్టంగా ఆమెకు తినిపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌, సభ్యురాలు ప్రమీలా గుప్తా బాధితురాలిని పరామర్శించారు. జరిగిన విషయం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ దారుణంపై మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ సహించలేకపోయారు. వెంటనే ఆమె వివరాలు, ఫొటోలను తీసుకుని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ఫిర్యాదు చేశారు. ఘటన వివరాలు తెలుపుతూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదై నెల దాటినా ఇంకా నిందితులను అరెస్ట్‌ చేయలేదని గుర్తుచేశారు. వెంటనే నిందితులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

click me!