
అసోంలో బాల్య వివాహాలపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున కఠిన చర్యల పేరుతో పెద్ద సంఖ్యలో పలువురిని అరెస్టు చేసింది. ఈ చర్యపై గౌహతి హైకోర్టు ఘాటుగా స్పందించింది. బాల్య వివాహాలు చేశారన్న ఆరోపణలపై ఇప్పటివరకు అస్సాం వ్యాప్తంగా 3000 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వీరిని తాత్కాలిక జైళ్లలో ఉంచారు.
అయితే తమ కుటుంబాన్ని పోషించే ఏకైక వ్యక్తిని అరెస్టు చేయడాన్ని మహిళలు ఖండిస్తూ నిరసన తెలిపారు. పోలీసుల చర్యపై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్నేళ్ల నాటి కేసులే కావడంతో పోలీసుల చర్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాల్య వివాహాల కేసుల్లో లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం అమలు యొక్క చెల్లుబాటుపై కూడా నిపుణులు సందేహాలు లేవనెత్తారు.
ఈ క్రమంలో పోక్సో చట్టం కింద అరెస్టయిన తొమ్మిది మందికి గౌహతి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బాల్యవివాహాలపై కఠిన చర్యల పేరుతో జరుగుతున్న అరెస్టులను గౌహతి హైకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ చర్య ప్రజల వ్యక్తిగత జీవితంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించింది. అటువంటి కేసుల్లో నిందితుల కస్టడీ విచారణ అవసరం లేదని కోర్టు పేర్కొంది. పలువురు నిందితులు దాఖలు చేసిన ముందస్తు, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. అందరికీ బెయిల్ మంజూరు చేసింది. వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఈ ప్రభుత్వ చర్యపై న్యాయమూర్తి జస్టిస్ సుమన్ శ్యామ్ మాట్లాడుతూ ..ఆరోపణలు వింతగా ఉన్నాయని అన్నారు. లైంగిక దాడి ఆరోపణలపై కేసులు నమోదు చేయడంపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. 'పోక్సో మీరు(రాష్ట్ర ప్రభుత్వం) ఏదైనా జోడించవచ్చు. ఇక్కడ ఆరోపణ ఏమిటి? POCSO చేర్చినంత మాత్రాన, న్యాయమూర్తులు దానిని చూడరని అర్థమా? మేము ఇక్కడ ఎవరినీ బహిష్కరించడం లేదు. మిమ్మల్ని తనిఖీ చేయకుండా ఎవరూ ఆపడం లేదు. ఇక్కడ అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయా?' విచారణ సందర్భంగా వచ్చిన ఆరోపణలను వింతగా ఉన్నాయని అభివర్ణించారు.
వారందరినీ అరెస్టు చేయాలా?
సంబంధిత మరొక కేసులో.. "కస్టడీ విచారణలో విచారణ చేయాల్సిన అవసరం లేదని ఈ కోర్టు అభిప్రాయపడింది. మీరు ఎవరైనా దోషిగా తేలితే.. ఛార్జ్ షీట్ దాఖలు చేయండి. కోర్టు విచారణలో అతను/ఆమె దోషిగా తేలితే.. తప్పకుండా వారికి శిక్ష పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి అరెస్టులు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. పిల్లలు, కుటుంబ సభ్యులు, వృద్ధులు ఉన్నారు. సహజంగానే బాల్య వివాహాలు చెడ్డ ఆలోచన. మేము మా అభిప్రాయాలను తెలియజేస్తాము, అయితే వారందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టాలా అనేదే ప్రస్తుత సమస్య’ అని వ్యాఖ్యానించింది.
4000 పైగా కేసులు
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని పేద ఆరోగ్య ప్రమాణాలను పరిష్కరించడానికి ఒక మార్గంగా ప్రచారాన్ని ప్రారంభించారు. దీని తరువాత.. ఫిబ్రవరి 3 న, బాల్య వివాహాలపై 4,000 పోలీసు కేసులు నమోదు చేయడం ద్వారా చర్య ప్రారంభించారు. ఫిబ్రవరి 10న ఈ సామాజిక నేరానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో అస్సాం ప్రజల మద్దతు కూడా ఉండాలని కోరారు.