Gujarat Riots: గుజరాత్ అల్లర్ల కేసులో తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీల‌కు షాక్.. బెయిల్ నిరాకరించిన కోర్టు

By Rajesh KFirst Published Jul 30, 2022, 6:44 PM IST
Highlights

Gujarat Riots: గుజరాత్ అల్లర్ల కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్బీ శ్రీకుమార్‌ల బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది.
 

Gujarat Riots: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు కల్పిత సాక్ష్యాలను రూపొందించార‌నే ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట‌యిన‌ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  (డిజిపి) ఆర్‌బి శ్రీకుమార్‌లకు అహ్మదాబాద్‌లోని సెషన్స్ కోర్టు శనివారం బెయిల్ నిరాకరించింది. వారిద్ద‌రూ దాఖలు చేసిన ఉత్తర్వులను తిరస్కరిస్తున్నట్లు అదనపు ప్రిన్సిపల్ జడ్జి డిడి ఠక్కర్ తెలిపారు.

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఆర్. బి. శ్రీకుమార్ ల‌ను అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. వీరిద్ద‌రిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 468 (మోసం చేయాలనే ఉద్దేశ్యంతో ఫోర్జరీ చేయడం), 194 (నేరాన్ని నిరూపించే ఉద్దేశ్యంతో తప్పుడు సాక్ష్యాలను అందించడం లేదా కల్పించడం) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసింది.  

ఆనాటి(2002) న‌రేంద్ర‌మోడీ నాయక‌త్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దివంగత కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు జరిగిన పెద్ద కుట్రలో వారద్ద‌రూ స‌హ‌కరించార‌ని ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన అఫిడవిట్‌లో ఆరోపించింది.

2002లో గోద్రా రైలు దహనం ఘటన జరిగిన వెంటనే అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు తీస్తా సెతల్వాద్‌కు ₹ 30 లక్షలు చెల్లించినట్లు సిట్ సమర్పించిన దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు. శ్రీకుమార్ ఒక అవినీతి ప్రభుత్వ అధికారని  సిట్ పేర్కొంది. గుజరాత్ లోని ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రసీ, పోలీసులను త‌న స్వ‌ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశాడని సిట్ ఆరోపించింది. 
 
గుజ‌రాత్ అల్ల‌ర్ల‌పై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆరోపణలను నిందితులిద్దరూ ఖండించారు. తీస్తా సెతల్వాద్‌, శ్రీకుమార్‌ల బెయిల్‌ పిటిషన్లపై న్యాయస్థానం మంగళవారం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో తీస్తా సెతల్వాద్, శ్రీకుమార్, మాజీ IPS అధికారి సంజీవ్ భట్‌లను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ గత నెలలో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. 

click me!