2002 Gujarat Riots: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్, యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్ అరెస్టు

By Mahesh KFirst Published Jun 25, 2022, 8:05 PM IST
Highlights

గుజరాత్ పోలీసులు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్, యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్‌లను అరెస్టు చేశారు. 2002 గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే పోలీసులు వీరిని అరెస్టు చేయడం గమనార్హం.
 

న్యూఢిల్లీ: గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువరించిన తర్వాతి రోజే గుజరాత్ పోలీసులు యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్‌లను అరెస్టు చేశారు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని పోగు చేశారని గుజరాత్ పోలీసులు.. మాజీ ఐపీఎస్ అధికాారులు సంజీవ్ భట్, ఆర్‌బీ శ్రీకుమార్‌లతోపాటు యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్‌పైనా ఓ కేసు నమోదు చేశారు.

గుజరాత్ అల్లర్లలో కాంగ్రెస్ ఎంపీ ఎహెసాన్ జాఫ్రీ మరణించాడు. ఆయన సతీమణి జాకియా జాఫ్రీ పలు న్యాయస్థానాలను ఆశ్రయించి ఎన్నో పిటిషన్లు వేశారు. గుజరాత్ అల్లర్లు ముందస్తు ప్రణాళికగా జరిగాయని, ఆ కుట్రలో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సహా సుమారు 60 మంది అధికారుల ప్రమేయం ఉన్నదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా ఈ అల్లర్లను సరిగా దర్యాప్తు చేయలేదని, కుట్రదారులకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు.

జాకియా జాఫ్రీ ద్వారా ఈ ముగ్గురు నిందితులు తప్పుడు సమాచారంతో కోర్టుల్లో అనేక పిటిషన్లు వేయించారని పోలీసులు ఆరోపించారు. ఈ అల్లర్లను దర్యాప్తు చేసిన సిట్‌ హెడ్‌, ఇతరులకు కూడా వీరు జాకియా జాఫ్రీ ద్వారా తప్పుడు సమాచారాన్ని ఇప్పించారని ఆరోపణలు చేశారు. పిటిషన్‌ల ద్వారా ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేశారని పేర్కొన్నారు.

ట్రయల్ కోర్టు, గుజరాత్ కోర్టు కూడా గుజరాత్ అల్లర్లలో కుట్ర కోణం లేదని స్పష్టం చేశాయి. ప్రధాని మోడీ సహా 64 మందికి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ, ఈ క్లీన్ చిట్‌ను సవాల్ చేస్తూ జాకియా జాఫ్రీ పిటిషన్లు వేశారు.

నిన్న సుప్రీంకోర్టు కూడా ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఆ పిటిషన్‌లో ఇతరుల అభిప్రాయాలే.. అవి కూడా తప్పులతో నిండినవే ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలన్న డిమాండ్‌కు బలాన్ని చేకూర్చే కొత్త ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది.

click me!