
అహ్మదాబాద్: గుజరాత్‌లో ఓ అనూహ్య కేసు ముందుకు వచ్చింది. తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదని, ఆమెను తన భర్త దగ్గరి నుంచి తెచ్చి తన కస్టడీకి ఇవ్వాలని ఓ వ్యక్తి గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. తాము లీవ్ ఇన్ అగ్రిమెంట్‌లో ఉంటున్నామని అందుకు సంబంధించిన డాక్యుమెంట్‌ను చూపించాడు. ఈ కేసుపై గుజరాత్ హైకోర్టు సీరియస్ అయింది. పిటిషన్ వేసిన వ్యక్తికి రూ. 5 వేల జరిమానా విధించింది.
బనస్కాంత జిల్లా నుంచి ఈ పిటిషన్ ఫైల్ అయింది. తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఆమెకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారని, పెళ్లి అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆమె మంచి వైవాహిక జీవితంలో లేదని హేబియస్ పిటిషన్ వేశాడు. తన భర్తను, పుట్టింటిని వదిలి ఆమె తన వద్దకు వచ్చిందని, తాము ఇద్దరం సహజీవనం చేయడానికి అగ్రిమెంట్ పై సంతకాలు పెట్టుకున్నామని తెలిపాడు.
కొన్నాళ్లకు ఆమె భర్త కుటుంబం, తల్లిదండ్రులూ తన వద్దకు వచ్చి ఆమెను తీసుకెళ్లారని వివరించాడు. ఆ తర్వాత తన గర్ల్‌ఫ్రెండ్ కోసం అతను హేబియస్ కార్పస్ పిటిషన్ వేసినట్టు వివరించాడు. ఆమె తన భర్తతో చట్టవిరుద్ధమైన కస్టడీలో ఉన్నదని వాదించాడు. కాబట్టి, పోలీసులు ఆమెను తన భర్త వద్ద నుంచి తీసుకువచ్చి తన కస్టడీలోకి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని గుజరాత్ హైకోర్టును కోరాడు.
Also Read: 100 మార్కుల పేపర్‌లో 115 మార్కులు వచ్చాయి.. ఆ యూనివర్సిటీ ఎగ్జామ్ రిజల్ట్స్‌పై దుమారం
రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ కేసులో వాదిస్తూ.. ఇలాంటి పిటిషన్ దాఖలు చేయడానికి ఆ వ్యక్తి ఏ అర్హతా లేదని వాదించాడు. ఆమె తన భర్త కస్టడీలో ఉన్నదంటే.. దాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించలేమని స్పష్టం చేశాడు.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆ వివాహితతో పిటిషనర్ పెళ్లి జరగలేదని, ఆమె భర్త విడాకులూ తీసుకోలేదని జస్టిస్ వీఎం పంచోలీ, హెచ్ఎం ప్రచ్ఛక్‌ల ధర్మాసనం పేర్కొంది. కాబట్టి, ఆమె తన భర్త వద్ద ఉండటాన్ని ఇల్లీగల్ కస్టడీగా పేర్కొనలేం అని, లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నామనే అగ్రిమెంట్ ఆధారంగా చేసుకున్నంత మాత్రానా ఈ పిటిషన్ వేసే అర్హత పిటిషనర్‌కు లేదని స్పష్టం చేసింది. పిటిషన్ తోసిపుచ్చి.. పిటిషనర్‌కు రూ. 5 వేల జరిమానా విధించింది.