గుజరాత్ హైకోర్టులో మనుస్మృతి ప్రస్తావన.. ‘మైనర్‌లుగా ఉన్నప్పుడే గర్భం దాల్చేవారు’

By Mahesh K  |  First Published Jun 8, 2023, 11:35 PM IST

గుజరాత్ హైకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక దాడి బాధితురాలైన మైనర్ బాలిక గర్భం దాల్చినట్టు ఆలస్యంగా గుర్తించారు. గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోర్టును కోరగా.. మనుస్మృతి ప్రస్తావన తెచ్చింది.
 


అహ్మదాబాద్: గుజరాత్ హైకోర్టులో మనుస్మృతి ప్రస్తావనకు వచ్చింది. ప్రాచీనంలో 14 నుంచి 15 ఏళ్ల వయసులోనే ఆడ పిల్లలు పెళ్లి చేసుకునేవారని, 17 ఏళ్ల వయసులో తల్లులయ్యేవారని గుజరాత్ హైకోర్టు మౌఖికంగా పేర్కొంది. తన 7 ఏళ్ల గర్భాన్ని తొలగించాలని 17 ఏళ్ల బాలిక చేసుకున్న విజ్ఞప్తిని విచారిస్తూ గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఆ మైనర్ బాలిక లైంగికదాడి బాధితురాలు. ఆమె గర్భం దాల్చిందని తండ్రి ఏడు నెలల తర్వాత తెలుసుకున్నాడు. దీంతో తన బిడ్డ వయసును దృష్టిలో పెట్టుకుని ఆమె గర్భాన్ని మెడికల్ టర్మినేషన్ చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. 

Latest Videos

బాలిక గర్భ విచ్ఛిత్తి గురించి ఆమె తరఫు కౌన్సెల్ మాట్లాడుతుండగా.. జస్టిస్ సమీర్ జే దవే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పురాతన కాలంలో 14 ఏళ్లకు, 15 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం సాధారణంగా ఉండేది. 17 ఏళ్ల లోపే పిల్లలను కనేవారు. బహుశా మీరిది చదివి ఉండరు. ఈ విషయం తెలుసుకోవడానికైనా ఒకసారి చదవండి’ అంటూ పేర్కొన్నారు. 

సీనియర్ అడ్వకేట్ సికందర్ సయ్యద్ ఆ  మైనర్ బాలిక తండ్రి తరఫున వాదిస్తున్నారు. బాలిక ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ ఆగస్టు 18న ఉన్నదని కాబట్టి, అందుకే తొందరగా ఈ కేసును విచారణకు తీసుకోవాలని కోర్టును కోరారు. 

Also Read: లేడీ కిలాడీ.. డేటింగ్ యాప్‌లో కలిసిన వ్యక్తిని హోటల్ తీసుకెళ్లి లక్షల రూపాయలు వసూలుకు యత్నం.. ఏం జరిగిందంటే?

బాలిక, గర్భస్త శిశువు ఆరోగ్యం బాగుంటే గర్భ విచ్ఛిత్తిని ఈ కోర్టు అంగీకరించదని స్పష్టం చేసింది. ఆ బాలిక మెడికల్ ఎగ్జామినేషన్ కోసం ఆదేశించింది. రాజ్‌కోట్‌లోని ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. హాస్పిటల్‌లోని వైద్యుల ప్యానెల్‌తో ఈ మైనర్ గర్ల్‌ను పరీక్షించి, అత్యవసరంగా రిపోర్టును సమర్పించాలని తెలిపింది. 

ఆ వైద్యులు నివేదిక సమర్పించిన తర్వాత కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. తదుపరి విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది.

click me!