
Gujarat: త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం మాట్లాడుతూ.. తాను కృష్ణ జన్మాష్టమి నాడు జన్మించాననీ, కంసుని వారసులను అంతం చేయడానికి దేవుడు తనను ప్రత్యేక పనితో పంపాడని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లోని పాలకవర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆయన.. హిందూ వ్యతిరేకి అంటూ వెలువడిన పోస్టర్‌లపై ఆయన స్పందించినట్టు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. పోస్టర్లు, బ్యానర్లలో దేవుడిని కించపరిచే పదాలు ఉపయోగించారనీ, గుజరాతీ ప్రజలు బాధ్యులను శిక్షిస్తారని ఆయన అన్నారు.
వడోదరలో ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "పోస్టర్లు వేసిన వారు దేవుడిని అవమానించే పదాలు ఉపయోగించారు. వారు దేవుడిని అవమానించారు. వారు నన్ను ఎంతగా ద్వేషిస్తారు, వారు పోస్టర్‌లో దేవుడిని కూడా వదిలిపెట్టలేదు. అలాంటి వారికి ఇక్కడి ప్రజలు తగిన విధంగా రాబోయే రోజుల్లో సమాధానం చెబుతారు" అని పేర్కొన్నారు. అలాగే, తాను కంసుని వంశస్థులను అంతం చేయడానికి దేవుడు ప్రత్యేక పనితో పంపిన వ్యక్తిగా, హనుమంతునికి గొప్ప భక్తుడుని అంటూ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కలిసి పాల్గొన్న రోడ్ షోలో జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ నినాదాలు చేశారు.
అయితే, గుజరాత్ లోని చాలా నగరాల్లో అంతకుముందు రోజు.."హిందూ వ్యతిరేకి" అనే నినాదంతో కూడిన బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. అందులో అరవింద్ కేజ్రీవాల్ ఉన్న చిత్రాలు కూడా కనిపించాయి. కాగా, గుజరాత్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆప్ దూకుడుగా ముందుకు సాగుతోంది. పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారీ విజయం నింపిన ఉత్సాహంతో ఇక్కడ కూడా మెరుగైన ఫలితాలు రాబట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ నాయకులు గుజరాత్ లో వరుస పర్యటనలు చేస్తున్నారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. ఓటర్లను తమవైపుకు తిప్పుకోవడానికి ఆప్ నమూనాను ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. ఇదివరకు 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ తొలిసారి రంగంలోకి దిగింది. కానీ, మంచి ఫలితాలను సాధించలేక పోయింది.
అయితే, ఫిబ్రవరి 2021లో సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (SMC) ఎన్నికల ఫలితాలతో గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ (AAP) మంచి ఫలితాలు సాధించింది. దీంతో అప్పటి నుంచి ఆప్ రాష్ట్ర రాజకీయాలపై మరింత దృష్టి సారించి అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (SMC) ఎన్నికల్లో బీజేపీ 93 సీట్లు గెలుచుకుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 27 సీట్లు గెలుచుకుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. అయితే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన కాంగ్రెస్.. 77 సీట్లను సాధించి పాలక బీజేపీలో భయం కలవరం రేపింది. ప్రస్తుతం, కాంగ్రెస్, బీజేపీలపై ఆప్ విమర్శల దాడిని కొనసాగిస్తూ.. గుజరాత్ లో ప్రజలకు దగ్గరవుతోంది. బీజేపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది.