
Gujarat: గుజరాత్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అక్రమ ఆయుధాల రాకెట్‌ను ఛేదించింది. ఇందులో 24 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి 54 దేశీయ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందులో అధిక శాతం తుపాకులను సౌరాష్ట్ర ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా దేవేంద్ర బోరియా, చంప్‌రాజ్ ఖచర్ లను గుర్తించారు. గత రెండేళ్లలో సురేంద్రనగర్, రాజ్‌కోట్‌లతో సహా సౌరాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 కంట్రీ మేడ్ పిస్టల్స్‌ను విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
విశ్వనీయ వర్గాల సమాచారం మేరకు ATS బృందం మే 3న అహ్మదాబాద్ నగరంలోని గీతా మందిర్ ప్రాంతంలో సురేంద్రంగార్ నివాసితులైన బోరియా, ఖచర్‌లను పట్టుకున్నట్లు ATS డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్ష్ ఉపాధ్యాయ తెలిపారు.
"మేము వారి వద్ద నుండి నాలుగు కంట్రీ మేడ్ పిస్టల్స్‌ని స్వాధీనం చేసుకున్నాము. తాము మధ్యప్రదేశ్ నుండి తుపాకులను కొనుగోలు చేశామని, వడోదరకు చెందిన వ్యక్తికి తుపాకీలను పంపిణీ చేయబోతున్నామని ఇద్దరూ అంగీకరించారు. గత రెండేళ్లలో సౌరాష్ట్రలో దాదాపు 100 పిస్టల్స్ విక్రయించినట్లు వారు అంగీకరించారు అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్ష్ ఉపాధ్యాయ తెలిపారు.
వారు ఒక్కో పిస్టల్‌కు దాదాపు ₹ 15,000 నుండి ₹ 25,000 వరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. వారు తమ కస్టమర్‌ల నుండి ఒక్కొక్కరికి ₹ 40,000 నుండి ₹ 1 లక్ష వరకు వసూలు చేస్తారని మిస్టర్ ఉపాధ్యాయ్ చెప్పారు. తమ కస్టమర్ల వివరాలను రాబట్టిన తర్వాత.. ATS బృందాలు 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 22 మంది వ్యక్తులను పట్టుకున్నారని, వారి వద్ద నుండి 50 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు ATS బృందం 54 అక్రమ తుపాకులను స్వాధీనం చేసుకుందని 24 మందిని అరెస్టు చేసిందని తెలిపారు. ఈ అక్రమ ఆయుధాల నెట్‌వర్క్‌పై తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.