కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం.. రాష్ట్రపతి ప్రదానం

By telugu teamFirst Published Nov 22, 2021, 12:52 PM IST
Highlights

భారత వైమానిక దళంలో గ్రూప్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం లభించింది. పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చిన కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ రోజు ఉదయం ప్రదానం చేశారు. భారత ప్రభుత్వం అందించే గ్యాలంట్రీ అవార్డుల్లో ఇది మూడో అత్యున్నత పురస్కారం.
 

న్యూఢిల్లీ: Indian Air Force పైలట్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌(Abhinandan Varthaman)కు భారత ప్రభుత్వం వీరచక్ర(Vir Chakra) పురస్కారంతో సత్కరించింది. ఈ రోజు ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర అవార్డును ప్రదానం చేశారు. Pakistan ఫైటర్ జెట్ F-16ను నేలమట్టం చేసిన కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు ఇటీవలే వీరచక్ర అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. Balakot మెరుపు దాడుల సమయంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత్ వైపు దూసుకు వస్తుంటే కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ సమర్థవంతంగా వాటిని నిలువరించగలిగాడు. ఆ యుద్ధ విమానాలను తరుముతూ శత్రు దేశంలోకి వెళ్లాడు. అక్కడే ఎఫ్-16ను నేలమట్టం చేశాడు. ఆయన విమానం కూడా దెబ్బతినడంతో ప్యారాచూట్ సహాయంతో అదే దేశంలో దిగాడు.

2019 ఫిబ్రవరి 14న జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భారత సైనికులపై ఆత్మాహుతి దాడి జరిగింది. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సూసైడ్ బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడు. అనంతరం జైషే మహ్మద్ ఈ దాడికి బాధ్యతనూ ప్రకటించింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. జైషే మహ్మద్ ఉగ్రశిబిరాలున్న పాకిస్తాన్‌లో బాలాకోట్‌లోని ఖైబర్ పక్తుంక్వా కనుమలలో భారత వాయు దళం Air Strike నిర్వహించింది.

Group Captain Abhinandan Varthaman awarded the Vir Chakra by President of India Ram Nath Kovind. 🇮🇳🔥🙏

pic.twitter.com/9bUDsY5dsO

— Aditya Raj Kaul (@AdityaRajKaul)

Also Read: బాలాకోట్‌ దాడుల హీరోకు ప్రమోషన్.. ఇక గ్రూప్ కెప్టెన్‌గా అభినందన్ వర్థమాన్

భారత వైమానిక దళ మెరుపు దాడుల తర్వాతి రోజు పాకిస్తాన్ నుంచీ సుమారు 24 యుద్ధ విమానాలు భారత సరిహద్దు వైపునకు బయల్దేరాయి. ఎల్‌వోసీ దాటి భారత గగనతలంలోకి వచ్చాయి.  భారత దేశ భూభాగంలో బాంబులు వేశాయి. ఇది గమనించి భారత వైమానిక దళం కూడా ఎదురెళ్లింది. అవి వెనుదిరిగాయి. ఓ ఎఫ్-16 విమానాన్ని టార్గెట్ చేసిన కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ దాన్ని తరుముకుంటూ వెళ్లాడు. అలా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాడు. అంతేకాదు, ఆ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చాడు. అయితే, కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ విమానం కూడా దెబ్బతిన్నది. దీంతో ఆయన ప్యారాచూట్ సహాయంతో పాకిస్తాన్ భూభాగంలో దిగాడు. అక్కడి స్థానికులు ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ అధికారులు ఆయనను బంధించారు.

Also Read: పాక్ వైమానిక దళాన్ని బోల్తా కొట్టించిన భారత్

కానీ, భారత దౌత్య అధికారులు ఒత్తిడి తేవడంతో పాకిస్తాన్ అభినందన్ వర్ధమాన్‌ను విడిచిపెట్టడానికే నిర్ణయించుకుంది. ఆయన టీ తాగుతూ కనిపించిన వీడియోను పాకిస్తాన్ విడుదల చేసింది. ఆ తర్వాత శాంతి సూచకంగా తాము అభినందన్ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించాలని భావిస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అనంతరం ఆయనను వాగా అట్టారి సరిహద్దులో భారత అధికారులకు అప్పగించారు. అనంతరం ఆయన ఎప్పటిలాగే విధుల్లో చేరారు. ఈ ఘటన తర్వాత వింగ్ కమాండర్ స్థాయి నుంచి పదోన్నతి కల్పించి గ్రూప్ కమాండర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన వైమానిక దళంలో గ్రూప్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రాజస్తాన్‌లోని ఎయిర్‌ఫోర్స్ ఫ్రంట్‌లైన్ యూనిట్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత మిగ్-21 యుద్ధ విమానంతో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చిన తొలి పైలట్‌గా కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ రికార్డుల్లోకి ఎక్కారు.

click me!