ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులు: ఈడీ, సీబీఐలపై సుప్రీం సీరియస్ కామెంట్స్

By narsimha lodeFirst Published Aug 25, 2021, 3:39 PM IST
Highlights

ఎంపీ, ఎమ్మెుల్యేలపై 10 ఏళ్లైనా ఛార్జీషీటు దాఖలు చేయకపోవడంపై  సీబీఐ, ఈడీలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల దర్యాప్తు నత్తనడకన సాగడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల దర్యాప్తు వేగంగా సాగకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మెజారిటీ కేసుల్లో ఛార్జీషీట్లు కూడా దాఖలు చేయకపోవడంపై కూడా ఈడీ, సీబీఐలు సమాధానం చెప్పలేని స్థితిలో ఉండడంపై  సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల స్థితిగతులపై అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది  విజయ్ హన్సారియా తాజాగా సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించారు.మనీలాండరింగ్ కేసుల్లో 91 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులుగా ఉన్నారని ఆ నివేదికలో తెలిపారు.

సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో 151 కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. 58 పెండింగ్ కేసుల్లో జీవిత ఖైదు పడే అవకాశం ఉందని ఆ నివేదిక తెలిపింది. 45 కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదని  ఆ నివేదిక వెల్లడించింది.

ఈ నివేదికపై ఆధారంగా సీజేఐ  దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.  10  ఏళ్లు దాటిన కేసుల్లో కూడ ఛార్జీషీట్లు కూడ దాఖలు చేయకపోవడంపై ఆయన ప్రశ్నించారు.

ఛార్జీషీటు లేకుండా ఆస్తులు స్వాధీనం చేసుకొంటే ఏం ప్రయోజనమని  సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం 8 కేసుల్లో మాత్రమే కోర్టుల నుండి  స్టే ఉత్తర్వులున్నాయని ఆయన చెప్పారు. కేసుల విచారణలో మానవ వనరుల కొరత ప్రధాన సమస్యగా ఉందన్నారు సీజేఐ.  జడ్జిల సంఖ్య  మౌళిక సదుపాయాలు  సమస్యగా మారుతున్నాయన్నారు. 

click me!