రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలు కాపాడితే రూ. 5వేల ప్రోత్సాహకం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

By telugu teamFirst Published Oct 6, 2021, 8:05 PM IST
Highlights

రోడ్డు ప్రమాదాల్లో గాయాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితులను సకాలంలో హాస్పిటల్‌కు చేర్చి వారిని రక్షిస్తే ప్రభుత్వం సహాయం చేసిన వ్యక్తికి రూ. 5వేలను ప్రోత్సాహకంగా అందజేయనుంది. గుడ్ సమరిటన్స్ పేరిట ఈ స్కీమ్‌‌ గురించి ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఈ నెల 15 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది.
 

న్యూఢిల్లీ: ఒకప్పుడు సాటి మనిషి సమస్యల్లో ఏదో ఒక రూపంలో సహాయపడేవారు. కానీ, నేడు మారిన జీవనశైలిలో, గజిబిజి బిజీబిజీ బతుకుల్లో సాటి మనుషుల సమస్యలను పట్టించుకునేవారు చాలా స్వల్పం. రోడ్డు ప్రమాదాల్లో చాలా మందికి తక్షణ సహాయం అందితే బ్రతికే అవకాశముండి మరణిస్తున్నారు. అందుకే అలాంటి వారిని ‘గోల్డెన్ అవర్‌’లో అంటే గాయపడిన గంటలో సమీప ఆస్పత్రికి లేదా ఇతర క్లినిక్‌లకు తీసుకెళ్లి చికిత్స అందిస్తే మరణాలను చాలా వరకు నివారించవచ్చు. అందుకే రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని గోల్డెన్ అవర్‌లో తీసుకెళ్లి ప్రాణాలు రక్షించినవారికి కేంద్రం రూ. 5 వేలు అందించాలని నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి గుడ్ సమరిటన్స్ పేరిట ఇది అమల్లోకి రానుంది. 2026 మార్చి 31వరకు ఈ స్కీం అమలుకానుంది.

వాహనాల ద్వారా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వారిని రక్షించే గుడ్ సమరిటన్స్‌కు రూ. 5వేలు అందించాలని రాష్ట్ర రవాణా, రహదారుల శాఖలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ లేఖ రాసింది. పరిహారంతోపాటు ప్రశంసా పత్రమూ అందించనున్నారు. అంతేకాదు, ఏడాది మొత్తంలో జాతీయంగా పది స్థాయిల్లో ఉత్తమ గుడ్ సమరిటన్స్‌ను గుర్తించి ఒక్కొక్కరికి రూ. 1 లక్ష అవార్డును ప్రకటించనున్నారు.

ఒక ప్రమాదంలో ఒకరికి మించి బాధితులను ఒకరికి మించి గుడ్ సమరిటన్స్ కాపాడితే ప్రాణాలు నిలుపుకున్న బాధితులను లెక్కించి ఒక్కరికి 5వేల చొప్పున సమరిటన్స్‌కు అందిస్తారు. ఇందుకోసం రూ. 5 లక్షలతో ప్రాథమిక నిధిగా ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది.

రోడ్డు ప్రమాదం గురించి పోలీసులకు తెలిపి హాస్పిటల్ తీసుకెళ్లి బాధితులను రక్షించినప్పుడు వైద్యుల నుంచి సమాచారం తెలుసుకుని పోలీసులు సమరిటన్స్‌కు ఒక ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. అధికారిక లేఖపై రాసి అక్నాలెడ్జ్‌మెంట్ అందజేస్తారు. అదే పత్రంలో సదరు వ్యక్తిని గుడ్ సమరిటన్‌గా పేర్కొంటూ జిల్లా స్థాయి అధికారుల కమిటీకి పంపిస్తారు.

లేదా ప్రమాద స్థలం నుంచి బాధితులను నేరుగా హాస్పిటల్‌కు తీసుకెళితే ఆ హాస్పిటలే వివరాలను పోలీసులకు అందజేస్తుంది. పోలీసులు సమరిటన్ ధ్రువీకరణను గుర్తించి పై అధికారులకు పంపిస్తారు.

click me!