
కేంద్ర ప్రభుత్వం రైతులను బెదిరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. బుధవారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఢిల్లీని ఎందుకు అష్టదిగ్భంధం చేస్తున్నారని ప్రశ్నించారు.
కేంద్రం రైతుల డిమాండ్‌లను తప్పనిసరిగా వినాలని రాహుల్ సూచించారు. బడ్జెట్‌లో రక్షణ రంగానికి పెద్దగా కేటాయింపులు లేవని... చైనాతో ఉద్రిక్తతలు ఉన్న సమయంలో రక్షణ రంగాన్ని పట్టించుకోరా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ఈ బడ్జెట్ వల్ల కేవలం 10, 15 మందికే ప్రయోజనమని... కేంద్రం దేశ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. రైతులకు కేంద్రం భయపడుతుందా..?
కాగా, వార్షిక బడ్జెట్ పై రాహుల్ గాంధీ తొలి రోజే స్పందించారు. ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తామన్న హామీని మర్చిపోయారని మోదీ సర్కారుపై విమర్శలు చేశారు. ప్రజలను విస్మరించిన మోదీ సర్కారు దేశ సంపదను ఆశ్రిత పెట్టుబడిదారుల పరం చేస్తోందని ఆరోపించారు.
ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పార్లమెంటులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఎంతో విసుగుచెందినట్టుగా హావభావాలు ప్రదర్శించారు.