భారీ భద్రత మధ్య కాశ్మీర్‌లో ప్రశాంతంగా పంద్రాగష్టు వేడుకలు

Siva Kodati |  
Published : Aug 15, 2019, 03:21 PM IST
భారీ భద్రత మధ్య కాశ్మీర్‌లో ప్రశాంతంగా పంద్రాగష్టు వేడుకలు

సారాంశం

ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన, కఠిన ఆంక్షల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ సత్యపాల్ మాలిక్ షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు

ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన, కఠిన ఆంక్షల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ సత్యపాల్ మాలిక్ షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సైనికులు, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ ప్రజల  ఉనికికి ఎప్పటికీ ముప్పు వాటిల్లదని ప్రాంతీయ సంస్కృతులకు రాజ్యాంగం ఎంతో విశిష్టతను కల్పించిందన్నారు. ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో అభివృద్ది పరుగులు తీస్తోందన్నారు.

ఆదివాసీ తెగలకు సైతం రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తోందని గవర్నర్ తెలిపారు. కాశ్మీరీ పండిట్లను తిరిగి తమ సొంత ప్రాంతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉగ్రవాద నిరోధానికి తీసుకుంటున్న చర్యల్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని సత్యపాల్ స్పష్టం చేశారు.

ఏడాది గవర్నర్ పాలనలో ప్రజలకు ప్రజాస్వామ్యంపై పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేశానన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఉగ్రవాద, వేర్పాటువాదులకు సరైన సమాధానం చెప్పారని గవర్నర్ ప్రశంసించారు.

ఈ వేడుకలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులెవరు ఈ వేడుకలకు హాజరుకాలేదు. ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించలేదు.. ప్రత్యేకంగా జారీ చేసిన పాసులు కలిగి వున్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?