లాక్ డౌన్ ఎత్తివేత దిశగా కేంద్రం అడుగులు: వీటికి అనుమతులు

By Sree sFirst Published Apr 25, 2020, 7:29 PM IST
Highlights

లాక్ డౌన్ ను ఉంచుతారా ఎత్తేస్తారా అని చర్చ నడుస్తుండగానే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తుందనే సంకేతాలను ఇస్తూ దుకాణాలను తెరవడానికి పర్మిషన్ ను ఇచ్చింది. 

కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడడానికి ప్రపంచం వద్ద ఎటువంటి ఆయుధం లేదు. కేవలం లాక్ డౌన్ లో తల దాచుకుంటూ ఆ వైరస్ నుంచి తప్పించుకుంటోంది. భారతదేశం కూడా ప్రపంచ దేశాలు చూపిన బాటలోనే పయనిస్తూ లాక్ డౌన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ మూడు వారల లాక్ డౌన్ ముగుస్తుండగానే.... మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు స్వయానా ప్రధానమంత్రే ప్రకటించారు. 

ఇక ఇప్పుడు రెండవ పర్యాయం విధించిన లాక్ డౌన్ కూడా మరో 9 రోజుల్లో ముగియనున్న విషయం అందరికి తెలిసిందే. మే 3వతేదితో ప్రధాని విధించిన లాక్ డౌన్ పూర్తవుతుంది. మే 7వ తేదీతో తెలంగాణాలో కూడా లాక్ డౌన్ ముగుస్తుంది. 

ఇక ఇప్పుడు రెండవ దఫా లాక్ డౌన్ కూడా ముగింపు దశకు రావడం, ఏప్రిల్ 27వ తేదీనాడు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో సర్వత్రా కూడా ఈ లాక్ డౌన్ పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

ఇలా లాక్ డౌన్ ను ఉంచుతారా ఎత్తేస్తారా అని చర్చ నడుస్తుండగానే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తుందనే సంకేతాలను ఇస్తూ దుకాణాలను తెరవడానికి పర్మిషన్ ను ఇచ్చింది. 

గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల షాపులను తెరవడానికి అనుమతిచ్చింది. పట్టణాల్లో మాత్రం కేవలం సింగల్ గా ఉండే షాపులకు మాత్రమే అనుమతులనిచ్చింది. షాపింగ్ మాల్స్ లో ఉండే షాపులకు మాత్రం  అనుమతులను నిరాకరించింది. 

అన్ని దుకాణాలకు అనుమతులను ఇచ్చినప్పటికీ మద్యం దుకాణాలకు మాత్రం అనుమతిని నిరాకరించింది. ఇలా దుకాణాలకు అనుమతులు ఇవ్వడంతో ఖచ్చితంగా లాక్ డౌన్ ను ఎత్తివేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమయినట్టయింది. 

click me!