రొటీన్: జస్టిస్ మురళీధర్ బదిలీపై రవిశంకర్ ప్రసాద్ వివరణ

By telugu teamFirst Published Feb 27, 2020, 11:35 AM IST
Highlights

జస్టిస్ మురళీధర్ బదిలీపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. సాధారణ బదిలీల్లో బాగంగానే మురళీధర్ బదిలీ జరిగిందని, కాంగ్రెసు దాన్ని రాజకీయం చేస్తోంందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ బదిలీపై వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన నలుగురు బిజెపి నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ మురళీధర్ ఢిల్లీ అల్లర్ల విషయంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బదిలీ కావడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

బిజెపి నేతలను కాపాడడానికి మురళీధర్ ను బదిలీ చేశారంటూ కాంగ్రెసు నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. దానిపై రవిశంకర్ ప్రసాద్ తన వివరణ ఇచ్చారు. సాధారణ బదిలీని కాంగ్రెసు రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన చేసిన సిఫార్సు మేరకే మురళీధర్ బదిలీ జరిగిందని వివరించారు. 

బదిలీ విషయంలో న్యాయమూర్తి అంగీకాకరం కూడా తీసుకున్నట్లు తెలిపారు. పద్ధతి ప్రకారమే, సాధారణ ప్రక్రియలో భాగంగానే మురళీధర్ బదిలీ జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెసు పార్టీ తిరస్కరించారని, దాంతో పద్ధతి ప్రకారం వ్యవస్థలను ధ్వంసం చేసే పనికి పూనుకుందని చెప్పారు. 

సుప్రీంకోర్టు కొలీజయం సిఫార్సు చేసిన రెండు వారాల తర్వాత అకస్మాత్తుగా బుధవారం రాత్రి జస్టిస్ మురళీధర్ బదిలీ జరిగింది. కొత్త పదవిలో చేరడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఏ విధమైన తేదీని కూడా నిర్దేశించలేదు. సాధారణంగా కొత్త పోస్టులో చేరడానికి న్యాయమూర్తులకు 14 రోజుల గడువు ఇస్తారు. తేదీ ఏదీ ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయనే అభిప్రాయం నెలకొంది.

click me!