ఇండియాలో కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. సోమవారం నాడే స్పుత్నిక్ టీకాకు అనుమతిచ్చిన కేంద్రం మంగళవారం నాడు మరో నిర్ణయం తీసుకొంది.
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. సోమవారం నాడే స్పుత్నిక్ టీకాకు అనుమతిచ్చిన కేంద్రం మంగళవారం నాడు మరో నిర్ణయం తీసుకొంది.పలు దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.ఇప్పటికే కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వ్యాక్సిన్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
రానున్న రోజుల్లో మరికొన్ని టీకాలకు కూడ కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. డబ్ల్యుహెచ్ఓ జాబితాలో ఉన్న ఎఫ్‌డీఏ, ఈఎంఏ, బ్రిటన్ హెంహెచ్ఆర్ఏ, జపాన్ వంటి దేశాల విదేశీ డ్రగ్స్ కంట్రోల్ బోర్డులు ఆయా దేశాల్లో పలు టీకాలకు ఆమోదం తెలిపాయి. ఇలా ఆమోదం పొందిన వ్యాక్సిన్లకు భారత్ లో అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇచ్చేందుకు జాతీయ నిపుణుల బృందం కేంద్రానికి సిఫారసు చేసింది.
తొలుత 100 మందిపై టీకాలను ప్రయోగం చేయనున్నారు. వాటి భద్రతపై వారం రోజుల పాటు ఫలితాలను విశ్లేషిస్తారు. ఈ ఫలితాలు బాగుంటే విదేశీ టీకాలను అనుమతివ్వనున్నారు. దేశంలోని 10.85 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. దేశంలో వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తని పెంచడంతో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్ ను అనుమతించడం ద్వారా కొరతను అధిగమించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.
జైడన్ క్యాడిలా, నోవావాక్స్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.