Goa Exit Polls: గోవాలో మళ్లీ హంగ్.. కమలానికి, కాంగ్రెస్‌కు చెరో 16 సీట్లు.. కింగ్ మేకర్‌లుగా ఈ పార్టీలు

Published : Mar 07, 2022, 08:49 PM IST
Goa Exit Polls: గోవాలో మళ్లీ హంగ్.. కమలానికి, కాంగ్రెస్‌కు చెరో 16 సీట్లు.. కింగ్ మేకర్‌లుగా ఈ పార్టీలు

సారాంశం

గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. పది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే.. గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని తెలుస్తున్నది. బీజేపీకి, కాంగ్రెస్ కూటమి 16 చొప్పున సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు అంచనాలు వేశాయి. కాగా, మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కింగ్ మేకర్‌గా మారే ఛాన్స్ ఉన్నది.   

న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికల(Goa Assembly Elections) ఫలితాలు మళ్లీ 2017 సీన్‌నే రిపీట్ చేసేలా ఉంటాయని ఎగ్జిట్ పోల్స్(Exit Polls) అంచనాలు వేశాయి. పది ఎగ్జిట్ పోల్స్ అంచనాల సగటు తీస్తే.. గోవా అసెంబ్లీలో హంగ్(Hung Assembly) ఏర్పడే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. బీజేపీకి, కాంగ్రెస్ కూటమికి చెరో 16 సీట్లు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్స్ మొత్తంగా తెలిపాయి. తృణమూల్  కాంగ్రెస్ మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నదని పేర్కొన్నాయి. ఇండియా న్యూస్, ఇండియ టీవీ సీఎన్ఎక్స్, ఇండియా టుడే, టైమ్స్ నౌ, ఏబీపీ, సీవోటర్ ఈటీజీ రీసెర్చ్ వంటి మొత్తం పది ఎగ్జిట్ పోల్స్ అంచనాల సగటు తీస్తే.. బీజేపీకి 16 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 16 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని పోల్ ఆఫ్ పోల్ రిజల్ట్‌లో వెల్లడైంది.

గోవాలో మెజార్టీ మార్క్ 21 సీట్లు. కానీ, ఈ రెండు ప్రధాన పార్టీలూ మెజార్టీ మార్క్‌కు ఆమడ దూరంలో నిలిచిపోయాయి. దీంతో మూడు సీట్లు గెలిచే అవకాశం ఉన్న టీఎంసీ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉన్నది. స్వతంత్ర అభ్యర్థులు లేదా ఆప్ పార్టీకి కూడా ప్రాధాన్యం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 10వ తేదీన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు విడతల పోలింగ్‌తో ముగియగా.. ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలు గత నెల 14వ తేదీన సింగిల్ ఫేజ్‌లో ముగిశాయి. గోవా అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ వివరాలు ఇలా ఉన్నాయి.

పర్యాటక రాష్ట్రంగా పేర్గాంచిన గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ లేదా కూటమి అయినా 21 సీట్లు సాధిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఫిబ్రవరి 14న జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 79%గా నమోదైంది. అత్యధికంగా సీఎం ప్రమోద్ సావంత్ పోటీ చేసిన సాంక్వెలిమ్‌ నియోజకవర్గంలో 89.64 శాతంగా రికార్డ్ అయింది. అయితే, ఈ సారి పోలింగ్ శాతం గత ఎన్నికల్లో(81.21శాతం) కంటే తగ్గింది.

గోవాలో అధికారంలో బీజేపీ ఉన్నది. సీఎంగా ప్రమోద్ సావంత్ ఉన్నారు. ఆయన గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం సాంక్వెలిమ్ నుంచే మరోసారి బరిలోకి దిగారు. కాగా, గోవా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ మరణం తర్వాత ఆయన కుమారుడు ఉత్పల్ పారికర్ తండ్రి పోటీ చేసిన పనాజీ నుంచే బరిలోకి దిగారు. పనాజీ నుంచి బీజేపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో స్వతంత్రంగా పోటీ చేశారు. కాంగ్రెస్ సీఎం ఫేస్‌ను ఇంకా ప్రకటించలేదు. ఆప్ మాత్రం అమిత్ పాలేకర్‌ను సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించింది.

రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి, స్వతంత్రంగా 301 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక్కడ బీజేపికి కాంగ్రెస్, మహారాష్ట్రవాది గోమంత్ పార్టీ, టీఎంసీ, ఆప్ పార్టీలు పోటీ ఇస్తున్నాయి.

గోవా రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల బెడద ఎక్కువ. ఇక్కడ పార్టీల కంటే రాజకీయ నేతలకే ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. నియోజకవర్గాలు చిన్నగా ఉండటంతో నేతలకే ప్రజలతో నేరుగా ఉండే సంబంధాలు ఎక్కువ.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ, 13 సీట్లు గెలుపొందిన బీజేపీ అధికారాన్ని చేపట్టింది. తొలుత చిన్న పార్టీలతో జత కట్టి బీజేపీ అధికారాన్ని చేపట్టగా.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచే పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 19కు చేరగా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 2కు పడిపోయింది. ఇదిలా ఉండగా, తృణమూల్ కాంగ్రెస్  ఈ రాష్ట్రంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా ఇక్కడ ప్రచారం చేయడం గమనార్హం. ఆప్ కూడా గోవాలో ప్రచారం ముమ్మరంగా చేపట్టింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu