
goa election news 2022 : గోవాలో షెడ్యూల్ తెగల (ST) వర్గానికి అన్యాయం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గత ప్రభుత్వాలు ఎస్టీలను నిర్లక్ష్యానికి గురి చేశాయని ఆరోపించారు. తాము గోవాలో అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన గోవాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోవాలో ఎస్టీల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిది పాయింట్ల ఎజెండాను ప్రకటించింది.
ఈ సమావేశంలో ఆరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) మాట్లాడుతూ.. గోవాతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎస్టీలకు ఉచిత విద్య, వైద్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అసెంబ్లీలో 12.5% కోటా కల్పిస్తామని చెప్పారు. గోవాలోని షెడ్యూల్డ్ తెగల వర్గాలను అన్యాయంగా నిర్లక్ష్యం చేశాయని, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించాయని ఆరోపించారు. అందుకే ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను తప్పకుండా కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాని కోసం తమ పార్టీ 8 పాయింట్ల ఎజెండాను ప్రకటించిందని తెలిపారు. వాటిని మీడియా సమావేశంలో ఆయన తెలియజేశారు.
గిరిజన సంఘాల కోసం గిరిజన ఉప ప్రణాళిక బడ్జెట్ (budjet) ను ఖర్చు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అలాగే ‘‘అత్యవసర ప్రాతిపదికన’’ భర్తీ చేసే 3,000 ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్టీలకు రిజర్వ్ చేసి ఉన్నాయని, ఆ ఉద్యోగాలు ఎస్టీ అభ్యర్థులకే కేటాయిస్తామని అన్నారు. అటవీ హక్కుల చట్టం అమలు చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో 12.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీలకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని అన్నారు. ఎస్టీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ (graduation) పూర్తి అయ్యే వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. షెడ్యూల్డ్ తెగల మహిళలకు నెలకు రూ.1,000 ఇస్తామని తెలిపారు. అలాగే నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం గోవా ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (app) సభ్యులంతా లీగల్ అఫిడవిట్లపై సంతకాలు చేశారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, పార్టీకి విధేయంగా ఉంటామని చెబుతూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. దానిపై ప్రజల్లో నమ్మకం కలిగేందుకు ఇలా బాండ్ పేపర్లపై తమ అభ్యర్థులు సంతకాలు పెట్టారని చెప్పారు. ఈ బాండ్ పేపర్ కాపీలు ప్రతీ ఎమ్మెల్యే అభ్యర్థి తన నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి పంపిస్తారని తెలిపారు. దీంతో హామీలు నెరవేర్చకపోతే ప్రజలకు ప్రభుత్వంపై కేసు పెట్టవచ్చని అన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు ఎవరూ కూడా ఇతర పార్టీలోకి వెళ్లబోరని స్పష్టం చేశారు.
గోవాలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆ పార్టీ విఫలం అయ్యింది. బీజేపీ అధికారం చేపట్టింది. తరువాత కాలంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన కొందరు అభ్యర్థులు బీజేపీలోకి, ఇతర పార్టీలో జంప్ అయ్యారు. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసినప్పటికీ ప్రభావం చూపలేకపోయింది. కానీ ఈ సారి మొదటి నుంచే పకడ్బందీగా అడుగులు వేస్తోంది. అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో గోవా ప్రజలకు హామీలు గుప్పిస్తోంది.