Agnipath Protest: రాష్ట్ర సర్వీసుల్లో అగ్నివీరుల‌కు రిజ‌ర్వేష‌న్లు: సీఎం ప్రమోద్ సావంత్ కీల‌క నిర్ణయం

By Rajesh KFirst Published Jun 23, 2022, 6:18 AM IST
Highlights

Agnipath Protest:  గోవా రాష్ట్ర సర్వీసుల్లో అగ్నివీరులకు రిజర్వేషన్ క‌ల్పిస్తామ‌ని, పోలీసు, అటవీ, జైళ్ల శాఖ వంటి సేవల్లో అగ్నివీరులకు ప్రాధాన్య‌త ఇస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు.  అగ్నిప‌థ్ పధ‌కాన్ని అంద‌రూ ఆహ్వానించాల‌ని అన్నారు. 
 

Agnipath Protest: దేశ‌వ్యాప్తంగా అగ్నిప‌థ్ కు వ్య‌తిరేక నిర‌స‌న‌లు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో గోవా సీఎం పథకాన్ని  స్వాగతించారు. ఈ కేంద్ర‌ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తుగా నిలిచారు. సీఎం సావంత్ విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పోలీసు, అగ్నిమాపక, అత్యవసర సేవలు, అటవీ, జైలు శాఖలలో అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, తాను ఇప్పటికే ప్రకటించానని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితమైన రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

మాజీ సైనికుల‌తో ఓ విభాగాన్ని ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. రాష్ట్రంలో పర్యటించి అగ్నిపథ్ పథకంపై యువతకు అవగాహన కల్పించే బాధ్యతను బీజేపీ మాజీ సైనికుల విభాగం తీసుకుందని సావంత్ చెప్పారు.  ఈ పథకం ద్వారా యువతకు రూ.4 లక్షల వార్షిక వేతనంతో నైపుణ్యం కలిగిన శిక్షణ ఇవ్వడమే కాకుండా దేశభక్తి, దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్న యువత తయారవుతుంద‌ని తెలిపారు.  
ఈ సంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను సావంత్ అభినందించారు. ఈ పథకాన్ని అందరూ స్వాగతించాలని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, అగ్నిపథ్ పథకం గురించి నిరసనకారుల నుంచి వినిపిస్తున్న ప్రధానమైన అసంతృప్త వ్యాఖ్యలు రెండు. ఒకటి ఉద్యోగ భద్రత. రెండోది పెన్షన్లు. అగ్నిపథ్ స్కీంకు ముందు రిక్రూట్‌మెంట్ చేసుకున్న వారికి 17 ఏళ్ల సర్వీసు ఉండేది. అందులోనూ కొందరు తమ సర్వీసు వ్యవధిని మరికొంత పెంచుకోవడానికి వెసులుబాటు ఉండేది. వీరికి జీవితాంతం పెన్షన్ లభించేది.

కానీ, కొత్త స్కీం ప్రకారం, అగ్నివీర్లు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగాలు చేస్తారు. ఆ తర్వాత చాలా మంది అగ్నివీర్లు రిటైర్ కావాల్సిందే. వారికి పెన్షన్లు ఉండవు. గతంలో తాము ఆర్మీ ఉద్యోగాల కోసం నాలుగు ఐదు సంవత్సరాలు కష్టపడేవారిమి అని నిరసనకారులు చెబుతున్నారు. తద్వారా ఉద్యోగం పొంది రిటైర్ అయ్యాక జీవితాంతం పెన్షన్లు కూడా వచ్చేవని అంటున్నారు. తమ ప్రిపేరేషన్‌కు కేటాయించిన సమయం కూడా తమ ఉద్యోగానికి ఉండకుంటే ఎలా అని నిలదీస్తున్నారు. అది కూడా నాలుగేళ్ల తర్వాత మళ్లీ నిరుద్యోగిగా బయటకు రావాల్సి ఉంటుందని అంటున్నారు.

అగ్నిపథ్ పథకం అంటే ఏమిటి?

దశాబ్దాలుగా కొనసాగుతున్న డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో సమూల మార్పు చేస్తూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో సైనికుల నియామకానికి 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీని కింద నాలుగు సంవత్సరాల స్వల్ప కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైనికుల రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఈ పథకం కింద ఈ ఏడాది మూడు సర్వీసుల్లో దాదాపు 46,000 మంది సైనికులను నియమించనున్నారు. ఎంపిక కోసం అర్హత వయస్సు 17 - 21 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఎంపికైన వారికి అగ్నివీర్ అని పిలుస్తారు. అగ్నివీర్లకు నెలకు 30 నుండి 40 వేల జీతం ఇవ్వ‌నున్నారు. నాలుగేండ్ల స‌ర్వీస్ త‌రువాత‌.. రిక్రూట్ చేయబడిన యువతలో 25 శాతం మందికి సైన్యంలోకి తీసుకుంటారు. మిగిలిన 75 శాతం మంది ఉద్యోగాన్ని వదిలివేయవలసి ఉంటుంది. 

click me!