కొత్త ఎంపీలకు ఎక్కువ అవకాశం ఇవ్వండి.. వారి బాధ అర్థం చేసుకోండి: రాజకీయ పార్టీలకు మోదీ పిలుపు

By Sumanth KanukulaFirst Published Dec 7, 2022, 12:31 PM IST
Highlights

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అంతరాయాల కారణంగా యువ ఎంపీలకు మాట్లాడే అవకాశం లభించడం లేదని ప్రధాని మోదీ అన్నారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు యువ పార్లమెంటు సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కోరారు. 

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అంతరాయాల కారణంగా యువ ఎంపీలకు మాట్లాడే అవకాశం లభించడం లేదని ప్రధాని మోదీ అన్నారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు యువ పార్లమెంటు సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కోరారు. పార్లమెంట్ శీతకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను మరింత ఫలవంతంగా నిర్వహించేందుకు సమిష్టిగా కృషి చేయాలని అన్ని పార్టీల నేతలను కోరారు. పార్లమెంట్‌కు అంతరాయం కలిగించడం మరియు వాయిదా వేయడం మంచిది కాదని సహా పార్లమెంటు సభ్యులు తనతో చెప్పారని అన్నారు. అలా చెప్పినవారిలో విపక్షాలకు చెందిన ఎంపీలు కూడా ఉన్నారని తెలిపారు. 

తాను యువ ఎంపీలతో మాట్లాడినప్పుడల్లా అంతరాయాల కారణంగా సభలో మాట్లాడే అవకాశం లభించడం లేదని చెప్పారని.. వారికి ఈ విషయంలో ఫిర్యాదు ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులు ఫస్ట్ టైమ్ ఎంపీలకు, యువ ఎంపీలకు నేర్చుకునే అవకాశాన్ని కూడా ఇవ్వదని అన్నారు. తమ ఉజ్వల భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్యంలో తర్వాతి తరాన్ని సిద్ధం చేయడం కోసం కొత్త ఎంపీలకు చర్చల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను మోదీ కోరారు. 

తదుపరి శీతాకాల సమావేశాలు కీలకమైనవని పేర్కొన్న ప్రధాని మోదీ.. జీ20కి అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు లభించిన తరుణంలో పార్లమెంట్ సమావేశమవుతుందని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న జీ20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వడం కేవలం దౌత్యపరమైన కార్యక్రమం మాత్రమే కాదని..  ప్రపంచం ముందు దేశ సామర్థ్యాలను చాటిచెప్పే అవకాశం కూడా అని అన్నారు. ఇటీవల జీ20పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీల నేతలతో తాను ఆత్మీయంగా చర్చించానని.. అది పార్లమెంటులో కూడా ప్రతిబింబిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.

‘‘ఈ సెషన్‌లో దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం, ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితుల మధ్య దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అన్ని పార్టీలు చర్చలకు విలువను జోడిస్తాయని నేను విశ్వసిస్తున్నాను’’ అని మోదీ  చెప్పారు. 
 

click me!