పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం.. జగదీప్‌ ధన్‌కర్‌కు ప్రధాని మోదీ అభినందనలు..

By Sumanth KanukulaFirst Published Dec 7, 2022, 11:35 AM IST
Highlights

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభలు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభలు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల కాలంలో మరణించిన ములాయం సింగ్ యాదవ్‌‌, పలువురు మాజీ సభ్యులకు సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు కొద్ది నెలల క్రితం ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌కర్.. రాజ్యసభ చైర్మన్‌ హోదాలో నిర్వహిస్తున్న తొలి సమావేశాలు ఇవే. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడుతూ.. జగదీప్ ధన్‌కర్‌కు శుభకాంక్షలు తెలిపారు. 

‘‘ఈ సభతో పాటు దేశం తరపున తొలిసారిగా రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మీకు అభినందనలు. మీరు అనేక బాధ్యతలన సమర్థవంతంగా నిర్వహించారు. పోరాటాల మధ్య జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు మీరు ఈ దశకు చేరుకున్నారు. ఇది దేశంలోని అనేక మందికి స్ఫూర్తి. మన ఉపరాష్ట్రపతి రైతు బిడ్డ. ఆయన సైనిక్ పాఠశాలలో చదివారు. అందువలన ఆయన జవాన్లు, రైతులతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను గుర్తుచేసుకుంటున్న సమయంలో, భారతదేశం జీ20 ప్రెసిడెన్సీని స్వీకరించిన సమయంలో ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి

మన గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  గిరిజన సమాజానికి చెందినవారు. ఆమె కంటే ముందు ఉన్న మన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందినవారు. ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి రైతు బిడ్డ. ఆయనకు చట్టపరమైన విషయాలపై కూడా గొప్ప అవగాహన ఉంది. 

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సులభంగా, బాధ్యతతో సాధించడంలో మన పార్లమెంటు ప్రపంచానికి టార్చ్ బేరర్‌గా ఉండబోతుంది. దేశానికి రాజ్యసభ అతిపెద్ద బలం. మన ప్రధానులు చాలా మంది రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు’’ అని మోదీ అన్నారు. 

ఇక, పార్లమెంట్ శీతకాల సమావేశాలు డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. ఈ సెషన్‌లో మొత్తం 17 పనిదినాలు ఉంటాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల కోసం కేంద్రం ఎజెండాలో 16 కొత్త బిల్లులు ఉన్నాయి. మరోవైపు  ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఈడబ్ల్యూఎస్‌ కోటా, రూపాయి మారకపు విలువ పతనం, ఇండో-చైనా సరిహద్దు సమస్య, అధిక జీఎస్టీ పన్నుల వంటి అంశాలపై పార్లమెంట్‌లో చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. 

click me!