
గువహతి: అసోంలో షార్ట్స్ వేసుకుని పరీక్ష రాయడానికి వెళ్లిన 19ఏళ్ల యువతికి చేదు అనుభవం ఎదురైంది. షార్ట్స్ వేసుకుని వచ్చినందుకు ఎగ్జామ్ హాల్‌లోకి ఇన్విజిలేటర్ రానివ్వలేదు. పరీక్ష రాయాలనుకుంటే ప్యాంట్ కొనుక్కోవాలని ఆదేశించారు. ప్యాంట్ కోసం తండ్రి పరుగున వెళ్లినప్పటికీ పరీక్ష సమయం స్టార్ట్ కావడంతో టైమ్ వేస్ట్ చేయాలనుకోవడం లేదని విద్యార్థిని చెప్పారు. దీంతో కాళ్లకు కర్టెన్ కట్టుకుని పరీక్ష రాయాల్సిందిగా టీచర్ స్పష్టం చేశారు. మరోదారి లేక ఆమె కర్టెన్ కట్టుకుని తీవ్ర ఒత్తిడిలో పరీక్ష రాసినట్టు తెలిపారు. అసోంలోని తేజ్‌పూర్ టౌన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అసోం అగ్రికల్చరల్ యూనివర్సిటీ(ఏఏయూ) ప్రవేశ పరీక్ష రాయడానికి 19ఏళ్ల జుబ్లీ తమూలీ తండ్రి బిశ్వనాథ్‌తో కలిసి ఉదయమే లేచి తేజ్‌పూర్ వెళ్లారు. అక్కడ గిరిజానంద్ చౌదరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల సైన్సెస్‌కు వెళ్లారు. షార్ట్స్ వేసుకుని వచ్చిందని సెక్యూరిటీ గార్డులు ఆమెను అడ్డుకోలేదు. కానీ, ఎగ్జామ్ హాల్‌కు వెళ్లాకే సమస్య వచ్చి పడింది.
‘సెక్యూరిటీ గార్డులు నన్ను కాలేజీ ప్రాంగణంలోకి రానిచ్చారు. కానీ, ఎగ్జామ్ హాల్ బయట ఇన్విజిలేటర్ ఆపాడు. షార్ట్స్ ధరించిన నన్ను ఎగ్జామ్ హాల్‌లోకి రానివ్వనని చెప్పారు’ తమూలీ వివరించారు. అడ్మిట్ కార్డులో లేదా కాలేజీ నిబంధనల్లోనూ ఈ విషయాన్ని పేర్కొనలేదని, ఇటీవలే నీట్ పరీక్షకు ఇదే పట్టణంలో ఇలాంటి దుస్తులతోనే వెళ్లారని చెప్పారు. తన వాదనలను ఎవరూ పట్టించుకోలేదని, బేసిక్ సెన్స్ లేదని తనపైనే దాడికి దిగినట్టు వివరించారు.
ఎగ్జామ్ హాల్‌కు రావాలంటే ప్యాంట్ కొనుక్కోవాలని చెప్పగానే బయట ఉన్న తండ్రి బిశ్వనాథ్ 8 కిలోమీటర్లుకు పరుగున వెళ్లారని, కానీ, అంతలోపే పరీక్ష హాల్‌లోకి అనుమతించాలని టీచర్లను తమూలీ వేడుకుంది. లోపలికి రావాలంటే కాళ్లను కవర్ చేసుకునేలా కర్టెన్ కట్టుకోవాలని చెప్పడంతో ఎగ్జామ్ టైమ్ వేస్ట్ అవుతున్నదని తమూలీ అంగీకరించారు.