కాంగ్రెస్ అధిష్టానానికి గులాం నబీ ఆజాద్ మరో షాక్.. కీలక పదవికి రాజీనామా..

Published : Aug 17, 2022, 09:48 AM IST
కాంగ్రెస్ అధిష్టానానికి గులాం నబీ ఆజాద్ మరో షాక్.. కీలక పదవికి రాజీనామా..

సారాంశం

కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్.. ఆ పార్టీ అధిష్టానానికి మరో షాక్ ఇచ్చారు. పార్టీ కీలక పదవికి రాజీనామా చేశారు. జమ్మూ కశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొద్దిసేపటికే ఆ పదవి నుంచి వైదొలిగారు. 

కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్.. ఆ పార్టీ అధిష్టానానికి మరో షాక్ ఇచ్చారు. పార్టీ కీలక పదవికి రాజీనామా చేశారు. జమ్మూ కశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొద్దిసేపటికే ఆ పదవి నుంచి వైదొలిగారు. అలాగే పార్టీ జమ్మూ కశ్మీర్ రాజకీయ వ్యవహారాల కమిటీకి కూడా రాజీనామా చేశారు. అయితే పార్టీ అధిష్టానంపై ఆజాద్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్‌ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్‌ కూడా ఉన్నారు. ఇటీవల ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగియగా.. ఆయనకు  కాంగ్రెస్ మరో అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. 

అయితే ఆరోగ్య కారణాల దృష్ట్యా గులాం నబీ ఆజాద్ కొత్త బాధ్యతలను స్వీకరించడానికి నిరాకరించినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితోనే అజాద్ ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆలిండియా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యునిగా ఉన్న ఆజాద్.. జమ్మూ కశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించి తన హోదాను తగ్గించారనే భావనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 

అయితే.. ఆజాద్‌ తన సన్నిహితుడు గులాం అహ్మద్‌ మీర్‌ను పార్టీ జమ్మూ కాశ్మీర్‌ విభాగం చీఫ్‌ పదవి నుంచి తొలగించిన కొద్దిసేపటికే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అహ్మద్ మీర్ గత నెలలో పదవీకి రాజీనామా చేయగా.. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం దానిని ఆమోదించారు. ఇక, ఆజాద్.. గతంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యంగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులను నిర్వర్తించారు. 

ఓటర్ల జాబితా ఖరారు, డీలిమిటేషన్ కసరత్తు పూర్తయిన తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వచ్చే ఏడాది అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్‌పై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.  జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా వికార్ రసూల్ వనిని, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రమణ్‌ భల్లాను సోనియా గాంధీ నియమించారు. అలాగే జమ్మూ కశ్మీర్‌లో.. ప్రచార కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, సమన్వయ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ, పబ్లికేషన్ కమిటీ, క్రమశిక్షణా కమిటీ, ప్రదేశ్ ఎన్నికల కమిటీని తక్షణమే అమలులోకి తెచ్చారు. అయితే కశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఆజాద్‌ను నియమించగా.. ఆయన ఆ బాధ్యతలను స్వీకరించడానికి నిరాకరించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్