ప్రజాస్వామ్య సూత్రాలను ఆశిస్తున్నాం..: రాహుల్ గాంధీ‌ అనర్హత వేటుపై స్పందించిన జర్మనీ

By Sumanth KanukulaFirst Published Mar 30, 2023, 10:33 AM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యతవంపై అనర్హత వేటువేయడంపై జర్మనీ స్పందించింది. రాహుల్ గాంధీ విషయంలో “ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు” వర్తిస్తాయని పేర్కొంది.

కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యతవంపై అనర్హత వేటువేయడంపై జర్మనీ స్పందించింది. రాహుల్ గాంధీ విషయంలో “ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు” వర్తిస్తాయని పేర్కొంది. జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కామెంట్ చేశారు. ‘‘భారత ప్రతిపక్ష రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన  తీర్పుతో అతని పార్లమెంటరీ ఆదేశాన్ని సస్పెండ్ చేయడం గురించి మేము గమనించాము. మాకున్న సమాచారం ప్రకారం..రాహుల్ గాంధీ తీర్పుపై అప్పీల్ చేయగల స్థితిలో ఉన్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. 

‘‘ఈ తీర్పు నిలబడుతుందా లేదా ఆయనకు ఇచ్చిన ఆదేశాన్ని సస్పెండ్ చేయడానికి ఏదైనా ఆధారం ఉందా.. అనేది ఆ తర్వాత స్పష్టమవుతుంది’’ అని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ కేసులో ‘‘న్యాయ స్వాతంత్ర్యం, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాల ప్రమాణాలు’’ వర్తిస్తాయని జర్మనీ ఆశిస్తున్నట్లుగా ఆమె చెప్పారు. అయితే జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఈ ప్రకటన తర్వాత.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన వెల్లడి కాలేదు.

ఇదిలా ఉంటే.. ఇదిలా ఉంటే.. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలారులో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..  మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ.. సూరత్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే రాహుల్‌ను సూరత్‌లోని కోర్టు జనవరి 23 దోషిగా తేల్చింది. 

రెండేళ్ల జైలు శిక్షను  కూడా విధించింది. అయితే కోర్టు ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. అయితే సూరత్ కోర్టు తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్‌లో రాహుల్‌పై లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తున్నట్టుగా వెల్లడించింది. అయితే అనర్హత వేటు కోర్టు తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్  గాంధీ వయనాడ్ నుంచి విజయం సాధించారు. 

click me!