
ఇండియన్ ఆర్మీ 29వ చీఫ్ గా జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ ఎం.ఎం. నర్వానే నుంచి ఆయన పదవిని చేపట్టారు. ఇంజనీర్ కార్ప్స్ ఆఫ్ ఆర్మీ నుండి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయిన మొదటి అధికారిగా మనోజ్ పాండే నిలిచారు. ఇది వరకు ఆయన డిప్యూటీ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఫిబ్రవరి 1న డిప్యూటీ ఆర్మీ చీఫ్‌గా ఎంపికవ్వడానికి ముందు ఆర్మీ తూర్పు కమాండ్‌కు నాయకత్వం వహించారు. ఈ కమాండ్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్లలో వాస్తవ నియంత్రణ రేఖను రక్షించే బాధ్యతలో నిమగ్నమై ఉంటుంది.
కాగా చైనా, పాకిస్తాన్‌లతో సరిహద్దుల్లో సవాళ్లతో పాటు భారతదేశం లెక్కలేనన్ని భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో జనరల్ మనోజ్ పాండే సైన్యానికి నాయకత్వం వహించనున్నారు. ఆర్మీ చీఫ్‌గా ఆయన థియేటర్ కమాండ్‌ను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రణాళికపై నేవీ, ఎయిర్ ఫోర్స్‌తో సమన్వయం చేయాల్సి ఉంటుంది. అయతే డిసెంబరు 2021లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ వాస్తవానికి ఈ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇంకా జనరల్ రావత్ వారసుడిని నియమించలేదు.
మనోజ్ పాండే తన కెరీర్‌లో అండమాన్, నికోబార్ కమాండ్ అధిపతిగా కూడా పనిచేశారు. భారతదేశంలోని త్రివిధ దళాలకు అండమాన్ నికోబార్ కమాండ్ మాత్రమే కమాండ్ గా ఉంది. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. జనరల్ పాండే డిసెంబర్ 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ (ది బాంబే సప్పర్స్)లో నియమితులయ్యారు. అనేక దశాబ్దాల సైనిక వృత్తిలో అతను సాంప్రదాయిక, కౌంటర్లలో అనేక ప్రతిష్టాత్మకమైన కమాండ్, స్టాఫ్ అసైన్‌మెంట్‌లను నిర్వహించాడు. అన్ని రకాల భూభాగాల్లో తిరుగుబాటు కార్యకలాపాలు చేపట్టారు.
ఆయన తన కెరీర్‌లో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించాడు. వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నాడు. పాండే జమ్మూ, కాశ్మీర్‌లో ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో నియంత్రణ రేఖకు సమీపంలో ఇంజనీర్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించాడు. పశ్చిమ లడఖ్‌లోని ఎత్తైన ప్రాంతాలలో పర్వత విభాగానికి, ఈశాన్యంలో ఒక కార్ప్స్‌కు కూడా నాయకత్వం వహించాడు.
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ MM నరవాణే పదవి విరమణ చేసే ముందు శనివారం జాతీయ యుద్ధ స్మారకం వద్ద భారత ధైర్యవంతులను గౌరవించే గంభీరమైన కార్యక్రమంలో పుష్పగుచ్ఛం ఉంచారు. సౌత్ బ్లాక్ లాన్స్‌లో ఆయన సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ పొందిన తరువాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిశారు. అయితే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఇండియన్ ఆర్మీ పగ్గాలు చేతపట్టడంతో ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక నుంచి ఆయన ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించున్నారు. ఆయన హెలికాప్టర్ పైలట్. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్‌గా పనిచేస్తున్నారు. తూర్పు లడఖ్‌లో సైన్యం మొత్తం కార్యాచరణ సంసిద్ధతను పర్యవేక్షిస్తున్నారు.