పెళ్లి బారాత్‌ మొదలుపెడుతుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. ఐదుగురు దుర్మరణం.. 50 మందికి గాయాలు

By Mahesh KFirst Published Dec 9, 2022, 2:28 PM IST
Highlights

రాజస్తాన్‌లో పెళ్లి బారాత్ తీయడానికి అందరూ సిద్ధం అవుతుండగా గ్యాస్ పేలింది. ఇందులో ఐదుగురు మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు.
 

జైపూర్: రాజస్తాన్‌లో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బారాత్ తీయడానికి అందరూ సిద్ధం అవుతుండగా పెళ్లి కుమారుడి ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. కనీసం 50 మంది గాయపడ్డారు. పెళ్లి జరుగుతున్న ఇల్లు కూడా కూలిపోయింది. ఈ ఘటన జోద్‌పూర్ జిల్లాలో భుంగ్రా గ్రామంలో జరిగింది.

ఒక వైపు పెళ్లి తంతు జరుగుతూ ఉండగా.. అతిథులు అంతా పెళ్లి వేడుకలో మునిగి ఉండగా వంట గదిలోని గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతూనే ఉన్నది. ఈ గ్యాస్ లీక్ కారణంగానే సిలిండర్ పెద్దగా పేలిపోయినట్టు అధికారులు తెలిపారు. 

ఈ ఘటనలో కొందరికి 80 శాతం నుంచి వంద శాతం గాయాలు అయ్యాయి. కాగా, 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 5 మంది గాయాలతో హాస్పిటల్ వచ్చారని జోధ్‌పూర్‌లోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ దిలీప్ కచవాహా తెలిపారు. ఇందులో ఇద్దరిని మరణించిన స్థితిలోనే తెచ్చారని పేర్కొన్నారు. 21 మంది పేషెంట్లను ఐసీయూలో, 9 మందిని జనరల్ వార్డులో చేర్చినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఆ ఇల్లు పాక్షికంగా కూలిపోయింది.

సీఎం అశోక్ గెహ్లాట్ ఈ రోజు హాస్పిటల్ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. గాయపడిన కుటుంబాలకు రూ 1. లక్ష పరిహారం అందించారు.

గ్యాస్ సిలిండర్లను మెయింటెనెన్స్‌ను పరీక్షించాలని గ్యాస్ సప్లై కంపెనీలను తాను కోరినట్టు వివరించారు. అంతేకాదు, బాధితులకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కంపెనీలను ఆదేశించనున్నట్టు తెలిపారు. గ్యాస్ సిలిండర్ల మెయింటెనెన్స్ పరిశీలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు చెప్పారు.

ఇది చాలా తీవ్రమైన ప్రమాదమని, 52 మంది గాయపడ్డారని, వారిని ఎంజీహెచ్ హాస్పిటల్‌కు తరలించామని జిల్లా కలెక్టర్ హిమాన్షు గుప్తా తెలిపారు. వారికి చికిత్స కొనసాగుతున్నదని పేర్కొన్నారు.

ఎంజీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజ్ శ్రీ బెహ్రా మాట్లాడుతూ.. హాస్పిటల్‌కు తీసుకువచ్చిన 12 మంది వరకు చాలా సీరియస్‌గా గాయపడ్డారని, వారికి 80 నుంచి 100 శాతం గాయాలు అయ్యాయని అన్నారు.

click me!