10 మంది చుట్టుముట్టి ఒక్కడిని చంపుతుంటే.. పారిపోయిన పోలీసులు

By Siva KodatiFirst Published Jun 29, 2020, 3:55 PM IST
Highlights

కళ్లేదుట నేరం జరుగుతుంటే జనానికి వెంటనే గుర్తొచ్చేది పోలీసులు. అలా ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడాల్సిన ఖాకీలే భయంతో పరుగులు తీశారు. 

కళ్లేదుట నేరం జరుగుతుంటే జనానికి వెంటనే గుర్తొచ్చేది పోలీసులు. అలా ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడాల్సిన ఖాకీలే భయంతో పరుగులు తీశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన మహరాష్ట్రలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి ముంబై ధారావి ఏరియాలోని డా. అంబేద్కర్ గార్డెన్ సమీపంలో నివాసం ఉండే అఫ్జల్ షేక్ అనే వ్యక్తి మిత్రులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాడు.

ఈ సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు అందరినీ వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో అఫ్జల్ స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ అతను మాత్రం అలాగే కూర్చున్నాడు.

ఇదే సమయంలో 10 మంది ఆయుధాలతో అతడిని చుట్టుముట్టి, విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. తీవ్రగాయాల పాలైన అఫ్జల్ అక్కడికక్కడే రక్తపుమడుగులో ప్రాణాలు కోల్పోయాడు.

ఈ సంఘటన జరిగే సమయంలో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదమైంది. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోయారని, వాళ్లక్కడే ఉండి వుంటే హత్య జరిగేది కాదని అంటున్నారు.

ఆ సమయంలో అదనపు బలగాలను రప్పించి ఉండాల్సిందని చెబుతున్నారు. విధులు సక్రమంగా నిర్వహించని ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!