
జైపూర్ : జైపూర్ లోని ఓ ఐవీఎఫ్ సెంటర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు తనమీద గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని గురువారం 30 ఏళ్ల మహిళ ఆరోపించింది. వీరిలో డాక్టర్‌తో సహా మరికొంతమంది ఉన్నారని ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెడితే..
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన తన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లో, "ఎగ్ డొనేషన్" కోసం తాను ఐవీఎఫ్ సెంటర్ కు వెళ్లానని తెలిపింది. ‘అండదానం’ చేస్తే డబ్బులిస్తామని వాగ్దానం చేశారని మహిళ పేర్కొంది.
ముగ్గురు భర్తలను వదిలేసి.. ఒంటరిగా ఉన్న కుమార్తెను చూసి తట్టుకోలేని ఆ తండ్రి చేసిన పని..
దీనికోసం ఆమె తన భర్త, బిడ్డతో కలిసి ఐవీఎఫ్ క్లినిక్ కి వెళ్లింది. ఎగ్ డొనేషన్ ప్రక్రియ చేయాలంటూ ఆమెను ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారని, ఆ తరువాత మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారని తెలిపింది. దీంతో తాను అపస్మారక స్థితికి చేరుకున్నానని.. ఆ తరువాత తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.
మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 (డి) (గ్యాంగ్ రేప్) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అజ్మీర్ నుంచి తమకు జీరో ఎఫ్‌ఐఆర్ అందిందని డీసీపీ (తూర్పు) జ్ఞాన్ చంద్ర యాదవ్ పేర్కొన్నారు. "ఆమె తన ఫిర్యాదులో ఒక వైద్యుడితో సహా ముగ్గురు వ్యక్తులను పేర్కొంది. ఆమె ఇంకా దర్యాప్తు కోసం నగరానికి రానందున అనుమానితుల గుర్తింపును ధృవీకరించవలసి ఉంది" అని కూడా అతను పేర్కొన్నాడు.
సామూహిక అత్యాచారం ఎక్కడ జరిగిందనేది ఈ దశలో కచ్చితంగా చెప్పలేమని చెప్పారు. "ఆమె ఐవీఎఫ్ కేంద్రానికి వచ్చినట్లు పేర్కొంది, సంఘటన ఎక్కడ జరిగిందో కూడా ఆమెతో మాట్లాడిన తర్వాత ధృవీకరించాల్సి ఉంటుంది" అని తెలిపారు.
(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)