
కోయంబత్తూర్: తమిళనాడులో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే నడివీధిలో కత్తులు, కొడవళ్లతో ఐదుగురు సభ్యులతో కూడిన ఓ ముఠా పేట్రేగిపోయింది. ఇద్దరు వ్యక్తులపై దాడి దిగింది. ఈ దాడిలో ఒకరు స్పాట్‌లోనే మరణించారు. మరొకరు గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని కోర్టు కాంప్లెక్స్ సమీపంలో సోమవారం సుమారు 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
కోయంబత్తూర్‌లోని కోర్టు కాంప్లెక్స్ పక్కనే ఐదుగురు దుండగులు ఇద్దరు వ్యక్తులను చుట్టుముట్టారు. వారిపై కత్తులతో దాడి చేశారు. ఇద్దరిలో ఒకరు గాయాలతో నేలపై పడిపోయాడు. ఇంకొకరు వారి నుంచి దూరంగా పరుగు పెట్టాడు. అతనికి తలకు, చేతికి గాయాలు కావడంతో రక్తం కారింది. మరో వ్యక్తి స్పాట్‌లోనే మరణించాడు.
పట్టపగలే రద్దీగా ఉన్న వీధిలోనే అందరూ చూస్తు ఉండగానే ఈ దాడి జరిగింది. అధికారులకు విషయం చేరవేయగా వారు క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించారు. అతడిని 27 ఏళ్ల మనోజ్‌గా గుర్తించారు. వారిద్దరూ ఓ కేసులో కోర్టుకు వచ్చినట్టు తెలిసింది. టీ కోసం బయటకు వెళ్లగానే వారిపై ఈ దాడి జరిగింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతు న్నది.