
న్యూఢిల్లీ: అమెరికా ఎయిర్ ఫోర్స్ కొన్ని రోజులుగా ఆకాశంలో గుర్తు తెలియని వస్తువులను షూట్ చేసి నేలకూల్చుతున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో మూడు ఇలాంటి వస్తువులను యూఎస్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ కూల్చేసిన ఈ గుర్తు తెలియని వస్తువులేమిటా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరేమో ఇవి ఏలియెన్సే అని వాదిస్తున్నారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ జనరల్ ఈ వాదనలను ఇప్పుడే కొట్టిపారేయలేం అని అన్నారు.దీంతో ఈ చర్చ మరింత ముదిరింది.
యూఎస్ యుద్ధ విమానాలు కూల్చేసిన గాలిలో ఎగిరే ఆ వస్తువులు గ్రహాంతరవాసులవేనా? అనే ప్రశ్నకు జనరల్ గ్లెన్ వ్యాన్ హెర్క్ ఇలా స్పందించారు. అవేమిటో తేల్చే పనిని ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీకే వదిలిపెడుతున్నట్టు వివరించారు. అయితే, ఇప్పటి వరకు ఏ వాదననూ కొట్టిపారేయలేం అని తెలిపారు.
ప్రస్తుతమైతే ముప్పు, దేశానికి తీవ్ర ముప్పు వంటి కోణాల్లోనే పరిశీలనలు జరుగుతున్నాయని వివరించారు. ఆ కోణంలోనే ఆ వస్తువులు ఏమిటా? అనే పరిశీలనలు కొనసాగుతున్నాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతో అమెరికా, కెనడా సరిహద్దు సమీపంలో హురోన్ సరస్సు పైన గుర్తు తెలియని ఎగిరే వస్తువును అమెరికా ఎఫ్-16 ఫైటర్ జెట్ కూల్చేసింది. ఈ విషయంపై ఆదివారం పెంటగాన్ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వ్యాన్ హెర్క్ తన అభిప్రాయాన్ని ఇలా పేర్కొనడం గమనార్హం.
ఆ మూడు వస్తువులను ఎవరు పైకి ఎగిరించారో, వాటికి ఇంధనం ఏమిటీ? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాలను వెంటనే వెల్లడించే పరిస్థితి ప్రస్తుతం అమెరికా మిలిటరీకి లేదని అన్నారు. వాటిని తాము బెలూన్లు కాకుండా వస్తువులు అని ఓ కారణం చేత పిలుస్తున్నట్టు వివరించారు.
యూఎఫ్‌ఏలపై దర్యాప్తు చేయడానికి అమెరికా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి సిద్ధమైన తరుణంలో ఇలాంటి వస్తువులు ముందుకు రావడం గమనార్హం.