
Gandhi Peace Prize: జాతిపిత మహాత్మాగాంధీ పేరిట కేంద్ర ప్రభుత్వం అందించే గాంధీ శాంతి పురస్కారానికి గోరఖ్‌పూర్‌కు చెందిన ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ‘గీతా ప్రెస్' ఎంపికైంది. గాంధీ శాంతి బహుమతి-2021 గీతా ప్రెస్ వరించింది. 'అహింసా ,గాంధేయ పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు చేసిన విశేష కృషికి గుర్తింపుగా 2021 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని గీతా ప్రెస్- గోరఖ్‌పూర్‌కు ఇవ్వబడుతుంది.' అని కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. శాంతి , సామాజిక సామరస్యానికి సంబంధించిన గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడంలో గీతా ప్రెస్ అందించిన సహకారాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. గీతా ప్రెస్ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీ శాంతి బహుమతిని అందించడం ఆ సంస్థ సమాజ సేవలో చేస్తున్న కృషికి గుర్తింపు అని ప్రధాని మోదీ అన్నారు.
గీతా ప్రెస్
గీతా ప్రెస్ 1923లో ప్రారంభించబడింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రచురణకర్తలలో ఒకటి. ఇది శ్రీమద్ భగవద్గీత యొక్క 16.21 కోట్ల కాపీలతో సహా 14 భాషలలో 41.7 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. గాంధీ శాంతి బహుమతి అనేది మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో ప్రారంభించారు. గాంధీజీ ప్రతిపాదించిన అహింస, గాంధీ మార్గంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పు కోసం విశేషంగా కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు.
విజేతకు ఏమి లభిస్తుంది?
జాతీయత, జాతి, భాష, కులం, మతం లేదా లింగంతో సంబంధం లేకుండా ఏ వ్యక్తికైనా అవార్డు ఇవ్వవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అవార్డు కోటి రూపాయలు, ప్రశంసా పత్రం, పతకం, అద్భుతమైన సాంప్రదాయ హస్తకళ/చేనేత వస్తువును బహుమతిగా అందిస్తారు. ఇటీవలి కాలంలో సుల్తాన్ ఖబూస్ బిన్ సయీద్ అల్ సైద్, ఒమన్ (2019), బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్, బంగ్లాదేశ్ (2020)లకు ఈ అవార్డు లభించింది.