శీతాకాలం కదా చమురు రేట్లు పెరుగుతాయి: ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 26, 2021, 5:43 PM IST
Highlights

శీతాకాలం పోతే పెట్రోల్‌ ధరలు దిగివస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరగడం వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేశాయి. దీంతో వాహనదారులు బండెక్కాలంటేనే భయపడుతున్నారు.

పెరిగిన ధరలను తగ్గించాలంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నిరసనలు చేపట్టాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సెక్రటేరియేట్‌కు వచ్చి నిరసన  తెలియజేశారు.

అటు జనం సైతం ప్రభుత్వాలు ధరలు తగ్గిస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

శీతాకాలం పోతే పెట్రోల్‌ ధరలు దిగివస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరగడం వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.

ధరల తగ్గుదల, పెరుగుదల అనేది అంతర్జాతీయ వ్యవహారమని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయని.. అలాగే ప్రతి ఏటా శీతాకాలంలో డిమాండ్‌ అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు.

దీని ప్రకారం చలి కాలం పూర్తయితే ధరలు తగ్గుతాయని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

click me!