ఇక నుంచి సినిమాలకు మత సెన్సార్ బోర్డు కూడా.. హిందూ దేవుళ్లని అవమానించే చిత్రాలను పర్యవేక్షించడానికే!

By Mahesh KFirst Published Jan 20, 2023, 4:02 PM IST
Highlights

ఇక నుంచి సెన్సార్ బోర్డుతోపాటు మత సెన్సార్ బోర్డు కూడా సినిమాలను పర్యవేక్షించబోతున్నట్టు తెలుస్తున్నది. అవిముక్తేశ్వరానంద్ సరస్వతి సెన్సార్ బోర్డుకు సమాంతరంగా హిందూ దేవుళ్లు, సనాతన సంస్కృతిని అగౌరవపరిచే, అవమానించే చిత్రాలను నియంత్రించడానికి ప్రత్యేకంగా మత సెన్సార్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు అవిముక్తేశ్వరానంద్ సరస్వతి వెల్లడించారు.
 

న్యూఢిల్లీ: సినిమాలను పర్యవేక్షించడానికి, వాటిని నియంత్రించడానికి ఇప్పటికే సెన్సార్ బోర్డు ఉన్న సంగతి తెలిసిందే. ఆ సెన్సార్ బోర్డు అనుమతితోనే సినిమాలను విడుదల చేస్తారు. ఈ సెన్సార్ బోర్డుకు సమాంతరంగా తాము ఒక సెన్సార్ బోర్డును ప్రారంభిస్తున్నామని శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ప్రకటించారు. పది సభ్యులతో ధరమ్ సెన్సార్ బోర్డును ఏర్పాటు చేసినట్టు ఆయన గురువారం వెల్లడించారు. 

ఈ బోర్డుకు హెడ్‌గా అవిముక్తేశ్వరానంద్ సరస్వతినే ఉంటారని వివరించారు. హిందూ దేవుళ్లను, హిందూ సంస్కృతిని అగౌరవపరిచే, అపకీర్తి పాలు చేసే చిత్రాలను ఈ బోర్డు పర్యవేక్షిస్తుందని చెప్పారు. అలాంటి సినిమాల విడుదలను తాము వ్యతిరకిస్తామని పేర్కొన్నారు. సినిమాలతోపాటు డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌లు, ఇతర మాద్యమాల ద్వారానూ కేవలం ఫిలిం అనే పేరుతో సనాతన సంస్కృతి పై దాడి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. 

మాఘ్ మేళా క్యాంప్‌లో గురువారం అవిముక్తేశ్వరానంద్ మాట్లాడుతూ, ‘మేం మా బోర్డు గైడ్‌లైన్స్ విడుదల చేశాం. చాలా మంది మతం, సంస్కృతి రంగాల్లో దిగ్గజాలు తమ బోర్డుతో మమేకమై ఉన్నారు. ప్రస్తుతానికి నేనే ఈ బోర్డుకు చైర్మన్’ అని వివరించారు.

Also Read: సినిమా టోగ్రఫీ చట్టం పై కమల్‌, సూర్య, అనురాగ్‌.. ప్రముఖుల అభ్యంతరాలు

హిందూ దేవుళ్లు, సంస్కృతిని అవమానించేలా ఆడియో, వీడియోల బ్రాడ్‌క్యాస్టింగ్, విడుదలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. హిందూ దేవుళ్లను అవమానించే చిత్ర నిర్మాణాలను ఆపడానికి తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాపులారిటీ కోసం హిందూ దేవుళ్లను అవమానించడం, సనాతన ధర్మాన్ని వక్రీకరించడాన్ని తాము ఇక పై ఎంతమాత్రం ఉపేక్షించబోమని పేర్కొన్నారు.

సెన్సార్ బోర్డు, ప్రభుత్వానికి సహకారంగానే తాము ఈ బోర్డును ఏర్పాటు చేసినట్టు వివరించారు. తమ బోర్డు ఫిలిం మేకర్లు, డైరెక్టర్లు అందరికీ ఈ విషయాలను తెలియజేస్తామని తెలిపారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండే చిత్రాలను వీక్షించరాదని తామే స్వయంగా హిందూ సమాజాన్ని కోరుతామని వివరించారు. ఈ కొత్త తరహా సెన్సార్ బోర్డు పై చర్చ మొదలైంది.

click me!