
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యుత్ ఘాతం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకర్ని కాపాడబోయి మరొకరు.. మరొకరిని కాపాడబోయి ఇంకొకరు ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలయ్యారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని బద్మేర్ జిల్లా పరిధిలోని ఆరంగ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న అర్జున్ సింగ్ ఇంట్లో ఈ దుర్ఘటన జరిగింది.
శుక్రవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో అర్జున్ సింగ్ భార్య తమ ఇంట్లో ఉన్న పిండిమరలో గోధుమలను ఆడిస్తుంది. ప్రమాదవశాత్తు ఆమె విద్యుత్ ఘాతానికి గురైంది. ఆమె అరుపులు విన్న తన పిల్లలు ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, వారికి కూడా విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఇలా అర్జున్ సింగ్ భార్య పిల్లల అరుపులు విన్న వారి సమీప బంధువు హటేసింగ్ హుటా హుటిన ప్రమాద స్థలానికి చేరుకొని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అతడు కూడా విద్యుత్ ఘాతానికి బలయ్యారు. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తమ ప్రాణాలను కోల్పోయారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన గురించి ఆ జిల్లా కలెక్టర్ అంజుమ్ తాహీర్ మీడియాతో మాట్లాడుతూ.. విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్ వలన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారని ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.