
న్యూఢిల్లీ: హర్యానా రాష్ట్రంోని గురుగ్రామ్‌లో ఒకే ఇంటిలో నలుగురు దారుణంగా హత్యకు గురయ్యారు. గురుగ్రామ్ రాజేంద్ర పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.ఈ సంఘటన మాజీ సైనికుడు రాయ్ రావు సింగ్ నివాసంలో చోటు చేసుకొంది. తన కోడలు సునీతా యాదవ్, అద్దెకు ఉంటున్న కృష్ణ తివారీ, ఆయన భార్య, అనామిక తివారీ బిడ్డను చంపినట్టుగా నిందితుడు రాయ్ రావు సింగ్ ఒప్పుకొన్నాడు. నిందితుడు రావు సింగ్ ను అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతుందని తెలిపారు.
మంగళవారం నాడు ఉదయం రాజేంద్ర పార్క్ పరిధిలోని ఓ ఇంట్లో మృతదేహలు ఉన్న విషయం తమకు సమాచారం అందిందని పశ్చిమ గురుగ్రామ్ డీసీపీ దీపక్ సహరన్ చెప్పారు.ఈ హత్యలకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
కృష్ణ తివారీ బావమరిది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. హత్య, కుట్ర అభియోగాలతో సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మంగళవారం నాడు తెల్లవారుజామున రెండు మూడు గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకొంది. సింగ్ కోడలి మృతదేహం మొదటి అంతస్తు తలుపు దగ్గర ఉంది. అక్కడ ఆమె అతని కొడుకుతో ఉంది. మరో ఇద్దరు మైనర్లు తల్లి మంచంపై పడుకొన్నారు. అద్దెకు ఉంటున్న వ్యక్తి పైన ఓ గదిలో పడుకొన్నాడు.నిందితుడు సుత్తిని ఉపయోగించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడికి అద్దెకు ఉంటున్న కృష్ణ తివారీకి మధ్య రెంట్ అగ్రిమెంట్ విషయమై వివాదం చోటు చేసుకొందని పోలీసులు చెబుతున్నారు. సింగ్ 1989-90 కాలంలో ఈ ప్రాంతానికి వచ్చాడు. అప్పటి నుండి ఇదే నివాసంలో ఉంటున్నారు. కూతురు వివాహం చేసుకొని వెళ్లిపోయింది. కొడుకు సునీతను వివాహం చేసుకొని మొదటి అంతస్తులో ఉంటున్నాడు. రెండో అంతస్తు, గ్రౌండ్ ఫ్లోర్ రెంట్ కు ఇస్తున్నారు.
కృష్ణ ఆయన భార్య అనామిక బీహార్ నుండి గత ఏడాది వచ్చి ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కరోనా కారణంగా బీహార్ వెళ్లి ఇటీవల కాలంలో కృస్ణ కుటుంబం తిరిగి వచ్చింది.
ఈ హత్యకు ఒక రోజుముందే సింగ్ కొడుకు తన స్నేహితులతో కలిసి రాజస్థాన్ లోని ఖతుష్యం ఆలయాన్ని సందర్శించేందుకు వెల్లాడు. సింగ్ కుటుంబంతో తమకు ఇబ్బందులున్నాయని కృష్ణ తమకు చెప్పాడని ఆయన సోదరి పోలీసులకు చెప్పింది. రాఖీ పూర్ణిమ రోజున తాను ఇక్కడికి వచ్చినట్టుగా చెప్పారు.